మందమర్రి,(విజయక్రాంతి): ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కొనసాగుతు ప్రజలకు సేవలు అందిస్తున్న పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని పట్టణ పాత్రికేయులు కోరారు. ఈ మేరకు గురువారం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కి పట్టణ పాత్రికేయులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాండ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్ లు మాట్లాడారు. గత రెండు దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతు సమాజానికి సేవలు అందిస్తున్నామని అన్నారు.
నిరుద్యోగుల మైన మేము సొంత నివాసాలు లేక అద్దె ఇళ్లలో కొనసాగుతు దుర్భర జీవనం కొన సాగిస్తున్నామని అన్నారు. కనీస నివాసం లేని నిరుపేద కుటుంబాలకు ఇంటిని అందజేయాలనే లక్ష్యం తో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇంటి పధకంలో భాగంగా ప్రతి పాత్రికేయ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు,ఇందిరమ్మ ఇల్లను మంజూరు చేయాలనీ వారు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పాత్రికేయులు బూర్ల రాజ్ కుమార్,రామోజు సంతోష్, చిలుక సంజీవ్ లు పాల్గొన్నారు.