జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటాల తరహాలో.. ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టులు పాలకుల మెడలు వంచేందుకు వినూత్న రీతిలో నిరసనలు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం 12 రోజులుగా నిరవధిక నిరసనలు, దీక్షలు చేస్తూ బుధవారం వంటా వార్పు నిర్వహించారు. జర్నలిస్టులే కూరగాయలు తరిగి వంటలు చేసి రోడ్డుపైనే సహపంక్తి భోజనాలు చేశారు.
టీయూడబ్ల్యూజె జగిత్యాల జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాస రావు మాట్లాడుతూ... ఇళ్ల స్థలాల కోసం వివిధ రూపాల్లో నిరసన తెలిపినా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారమయ్యేలా కృషి చేసే తమకు సమస్యలొస్తే తీర్చడానికి ప్రభుత్వం, నేతలు ముందుకు రాకపోవడం శోచనీ యమన్నారు. తమ కలం, గళం ద్వారా ఎంతోమంది నాయకుల తయారు చేశామని, నాయకులే తమ సేవలు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ న్యాయమైన కోరికను నెరవేర్చ కుంటే ఉద్యమాన్ని ఉధృతంతో పాటు జిల్లా వ్యాప్తం చేస్తామని హెచ్చరించారు.నిరసన దీక్షలకు జిల్లాలోని ప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ జగదీష్, శ్రీనివాస్ తదితరులు సంఘీభావం తెలిపారు. వంట వార్పుకు గోసేన అసోసియేషన్ జిల్లా యూత్ అధ్యక్షులు కట్ట శివకుమార్ సహకరించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాలచారి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాల్గొన్నారు.