25-04-2025 11:02:15 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం వద్ద అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజే-ఐజేయు) తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద చర్య అని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్ అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ముందు టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టులు కొవ్వొత్తులు వెలిగించి మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుర్ర సంపత్ కుమార్ మాట్లాడుతూ... అమాయక పౌరులపై జరిగిన ఈ దాడులు బాధాకరమని, సమాజానికి ఎంతో నష్టం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి దుఃఖంలో పాలుపంచుకుంటున్నామని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దేశాభివృద్ధికి, మానవత్వానికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఈ కష్ట సమయంలో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చింతకింది చంద్రమొగిళి, గుడ్ల శ్రీనివాస్, యండీ.గౌస్ పాషా, ప్రవీణ్ రెడ్డి, వీరమల్ల విద్యాసాగర్ రావు, పంది కుమార్, ముత్యాల కృష్ణమూర్తి, కొలిపాక కృష్ణ, మోదుంపల్లి సాగర్, ఈదునూరి జైపాల్, తిరుమల సురేష్, మోలుగూరి కమల్, జాపతి సంజీవ్, కన్నూరి ఆంజనేయులు, యండీ.ఇబ్రహీం, మాజీద్ పాషా, యండీ.వలీ పాషా, తిరుపతి, కొలిపాక సాగర్ తదితరులు పాల్గొన్నారు.