10-03-2025 12:37:59 AM
మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (విజయక్రాంతి): చదవడం, నేర్చుకోవడం, రాయడం ద్వారానే జర్నలిస్టులు వృత్తిలో రాణిస్తారని మీడియా అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. ప్రతి జర్నలిస్టు ప్రజోపయోగకర వార్తలు రాసినప్పుడే ఆ వృత్తికి సార్థకత ఉంటుందని చెప్పారు. ఆదివారం హైదారాబాద్ లోని ఖైరతాబాద్ పెరిక భవన్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెరిక జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు సమాజంలో జరిగే విషయాల పైనే అవగాహన ఉండాలని సూచించారు. సెన్సేషనల్ కథనాలు రాసినప్పుడే జర్నలిస్టుకు గుర్తిం పు వస్తుందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలని సూచించారు.
అనంతరం సీనియర్ జర్నలిస్టు గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు తమ వృత్తిలో రాణిస్తూ కుల అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మైలరిశెట్టి చైతన్య, బరపటి సంపత్, బంధు శ్రీధర్, ముద్దసాని రాంచందర్, పెరిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు శ్రీరామ్ దయానంద్, పెరిక వసతి గృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు చుంచు ఊశన్న, దొంగరి మనోహర్, సుంకరి ఆనంద్, అచ్చ రఘుబాబు తోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగా జర్నలిస్టులు తరలి వచ్చారు.