calender_icon.png 23 October, 2024 | 7:50 AM

హైదరాబాద్‌లో జోరువాన

15-07-2024 01:34:53 AM

  1. జలమయమైన రోడ్లు, కాలనీలు
  2. పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్ల కొమ్మలు 
  3. తలెత్తిన విద్యుత్తు అంతరాయం
  4. తప్పని ట్రాఫిక్ తిప్పలు 
  5. రాబోయే మూడు రోజులు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): నగరంలో ఆదివారం సాయం త్రం వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, సికింద్రా బాద్, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, తిరుమలగిరి, అల్వాల్, కవాడీగూడ, గాంధీనగర్, బేగంపేట్, మారేడ్‌పల్లి, బంజారాహిల్స్, మల్కాజిగిరి, కీసర, చర్లపల్లి, కుషాయిగూడ, కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఉదయం నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో కుండపోతగా కురిసిన వర్షానికి హుస్సేన్‌సాగర్ నీటి మట్టం పెరిగింది. ఫుల్ ట్యాంక్ లెవల్ 514 మీటర్లు ఉండగా 513.41 మీటర్ల నీటి మట్టానికి చేరుకుంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండగా మారింది.  సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో అత్యధికంగా 7.5 సెంటీమీటర్లు, యూసుఫ్‌గూడలో 7.4, ముషీరాబాద్‌లో 7.0,  షేక్‌పేటలో 6.9, శేరిలింగంపల్లిలో 6.8 సెంటిమీటర్లుగా నమోదవ్వగా, అత్యల్పంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా కురిసిన వర్షంతో రోడ్లపై మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, బంజారాహిల్స్, కొండాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్(డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్) బలగాలు రోడ్లపైకి చేరుకొని లోతట్టు ప్రాంతాల్లో  నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. రాబోయే మూడు రోజులు నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అధికారులతో మేయర్ విజయలక్ష్మి టెలీ కాన్ఫరెన్స్.. 

నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో  జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మిజోనల్ కమిషనర్లు, ఈవీడీఎం టీంలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వ హించారు. నాలాల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగే ప్ర మాదం ఉంటుంది కాబట్టి ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండా లని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తు న్న వేళ ప్రజలు ఇళ్లలోనే ఉండా లని, వర్షానికి సంబంధించి ఏమైనా అత్యవసర సహాయం అవసరమైతే 040 90001 13667 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. 

కారు కొట్టుకుపోతుండగా కాపాడిన యువకులు..

ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గ పరిధి పార్సిగుట్ట చౌరస్తా సమీపంలోని ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్ వెనుక వీధిలో ఐదుగురితో ఉన్న కారు వరద నీటిలో కొట్టుకుపోతుండగా స్థానిక యువకులు కాపాడారు. ముషీరాబాద్ గంగపుత్ర కాలనీకి చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా వర్షం నీరు రోడ్డుపై వెళ్తుండడంతో కారును నిలిపారు. అదే క్రమంలో వరద నీరు రోడ్డుపై పెద్ద ఎత్తున ప్రవహించడంతో కారు నీటిలో కొట్టుకొని పోతుండగా.. మార్టిన్ (బంటీ), ప్రణీత్ యాదవ్, నాగచారి అనే ముగ్గురు యువకులు గమనించి కారులో ఉన్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కారు డోర్ ఓపెన్ కాకపోవడడంతో అద్దాలను పగులగొట్టి ఐదుగురిని కాపాడారు. 

అధికారులను అప్రమత్తం చేశాం.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి 

వర్షాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులను అప్రమత్తం చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నగరంలో 140 లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు తొలగించేందుకు 228 స్టాటిక్ బృందాలు, 154 మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో పాటు 168 డివాటరింగ్ పంప్ సెట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటితో పాటు 29 సీఆర్‌ఎంపీ, ఈవీడీఎం ద్వారా సర్కిల్‌కు ఒక 30 మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని తొలగించినట్లు తెలిపారు.