నొవాక్ జొకోవిచ్.. రఫేల్ నాదల్.. ఇద్దరు ఇద్దరే. రెండు దశాబ్దాలుగా టెన్నిస్‌ను ఏకఛత్రాదిపత్యంతో ఏలుతున్న ఆటగాళ్లు. ఎన్నో మ్యాచ్‌ల్లో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా తలపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఎదురుపడగా.. అంతిమంగా జొకోనే విజయం వరించింది. విశ్వక్రీడల్లో టెన్నిస్ సింగిల్స్‌లో రెండోసారి గోల్డ్ మెడల్ సాధించాలన్న కల నెరవేరకుండానే నాదల్ నిష్క్రమించాడు.
పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ సింగిల్స్‌లో రెండో రౌండ్‌కే పరిమితమయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో సోమవారం జరిగిన రెండో రౌండ్‌లో జొకోవిచ్ 6 6 సునాయాస విజయాన్ని అందుకున్నాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో జొకోవిచ్ ముందు నాదల్ ఎక్కడా నిలవలేకపోయాడు. ఇటీవలే వింబుల్డన్ రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ బలమైన సర్వీస్‌లతో విరుచుకుపడ్డాడు. మ్యాచ్‌లో 5 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ 23 విన్నర్లు కొట్టాడు. కేవలం ఒక్క ఏస్‌కు మాత్రమే పరిమితమైన నాదల్.. రెండు డబుల్ ఫాల్ట్స్, 20 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.
24 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన జొకోవిచ్‌కు నాదల్‌పై ఇది 31వ విజయం కావడం విశేషం. కెరీర్ గ్రాండ్‌స్లామ్‌లు చాలాసార్లు అందుకున్న జొకోవిచ్ గోల్డెన్ గ్రాండ్‌స్లామ్ ఫీట్‌ను అందుకోలేకపోయాడు. తాజా ఒలింపిక్స్‌లో అది నెరవేర్చుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో రెండో రౌండ్‌లో బలమైన నాదల్‌ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇక నాదల్ కెరీర్‌లో ఇదే చివరి ఒలింపిక్స్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన నాదల్ రెండోసారి పసిడి నెగ్గి విశ్వక్రీడలకు ముగింపు పలుకుదామని భావించాడు. కానీ అతని ఆశలు నెరవేరలేదు. ఇక డబుల్స్ విభాగంలో సహచర ఆటగాడు కార్లోస్ అల్కారాజ్‌తో కలిసి నాదల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.