- రూ.కోట్లలో వ్యాపారం తాజాగా పట్టుబడ్డ కేసుతో
- ముఠా గుట్టురట్టు
- అధిక కమీషన్ల కోసం రొంపిలోకి దిగుతున్న యువత
- లోతైన దర్యాప్తు చేస్తే మరింత వెలుగులోకి..
మెదక్, జనవరి 19 (విజయక్రాంతి): అల్ఫాజోలం, డైజోఫాం, గంజాయిలాంటి మత్తు పదార్థాలకు అడ్డాగా ఉమ్మడి మెదక్ జిల్లా మారింది. రాష్ట్ర రాజధానికి సమీపాన, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండడంతో యధేచ్ఛగా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏదో ఒకచోట మత్తు పదార్థాలను పట్టుకున్న కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
తాజాగా సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన మంబాపూర్ వద్ద మెదక్ పట్టణానికి చెందిన సుధీర్గౌడ్ అల్ఫాజోలం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. తీగలాగితే డొంకంతా కదిలినట్లు సుధీర్గౌడ్ అరెస్టుతో భారీ ఎత్తున అల్ఫాజోలం మత్తు మందుతో పాటు సుమారు రూ.60 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడం జరిగింది.
సుధీర్గౌడ్తో పాటు మెదక్ పట్టణానికి చెందిన కొందరు, సంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరిని పోలీసులు అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున డ్రగ్స్, గంజాయికి అడ్డాగా ఉమ్మడి మెదక్ జిల్లా మారిందనడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
తాజాగా జిల్లాల ఎస్పీలు విడుదల చేసిన వార్షిక క్రైం రిపోర్టులో కూడా ఈ కేసులు సంఖ్య ఎక్కువగానే ఉండడం గమనార్హం. ముఖ్యంగా సుధీర్గౌడ్ అనుచరవర్గం మెదక్ పట్టణానికి చెందిన వారు కావడంతో ఒక్కసారిగా మెదక్లో ప్రకంపనలు పుట్టాయి.
కల్లు దుకాణాలకు సరఫరా..?
ఉమ్మడి మెదక్ జిల్లాలో అల్ఫాజోలం, డైజోఫాంలాంటి మత్తు మందులు కల్లులో కలిపి విక్రయించడం వ్యాపారులకు ఆనవాయితీగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఈత, తాటి చెట్ల పెంపకం చాలా తక్కువ. దీంతో కల్లు వ్యాపారులు కల్తీ కల్లును తయారు చేయడం, కల్లులో ప్రాణాంతకమైన అల్ఫాజోలం, డైజోఫాం లాంటి మత్తు పదార్థాలను కలపడంతో కల్లు సేవించే వ్యక్తికి తీవ్రమైన మత్తు, శరీరం నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది.
ఇది ప్రాణాంతకమని తెలిసినా ధనార్జనే ధ్యేయంగా చాలా ఏళ్ళ నుండి ఈ దందా కొనసాగుతోంది. రోజుకూలీలు, శ్రామికులు కల్లు సేవించడం బలహీనతను ఆసరా చేసుకొని వ్యాపారులు, డ్రగ్స్ ముఠా పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నట్లు తెలిసింది. తాజాగా బయటపడ్డ కేసులో ఏకంగా కెమికల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేసి అల్ఫాజోలం తయారీ చేస్తూ కోట్లకు పడగలెత్తిన విషయం బయటపడింది.
వీరి వ్యాపారం ఒక్క ఉమ్మడి జిల్లాలోనే కాకుండా పలు జిల్లాల్లో కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. చాలా కల్లు దుకాణాలకు అల్ఫాజోలం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో చాలా మంది కమిషన్ తీసుకుంటూ మత్తు మందులను సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పోలీసులు మరింత దృష్టి సారించి లోతైన దర్యాప్తు కొనసాగిస్తే చీకటి దందా చేస్తున్న ముఠాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు కోరుతున్నారు.