calender_icon.png 5 November, 2024 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కృష్ణ’ పిటిషన్లపై ఉమ్మడి విచారణ!

05-11-2024 01:50:56 AM

  1. ప్రాజెక్టులపై రెండు తెలుగు రాష్ట్రాల పిటిషన్లు
  2. కలిపి విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, నవంబర్ 4 (విజయక్రాంతి): కృష్ణా ప్రాజెక్టుల పరిధిపై రెండు తెలుగు రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కలిపి సుప్రీంకోర్టు విచారించనుంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 7న విచారణ చేసే అవకాశముంది. సోమవారం రెండు రాష్ట్రాల పిటిషన్లు వేర్వేరు డివిజన్ బెంచ్‌ల వద్ద విచారణకు వచ్చాయి.

తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీం దృష్టికి తెచ్చింది. దీంతో రెండు పిటిషన్లను జత చేయాలని రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా బేసిన్‌పై ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి తెస్తూ 2021 లో కేంద్రం గెజిట్ రిలీజ్ చేసింది.

అయితే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ కేంద్రాలను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం 2021 జూలై 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఆరోపించింది.

తెలంగాణ నిర్ణయం వల్ల ప్రాజక్టుల్లో నీటి వాటా వినియోగంలో వ్యాత్యాసాలు వస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా కేంద్రం జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో ఏపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది.

దీంతో తెలంగాణ దాఖలు చేసిన కేసుతో ఏపీ పిటిషన్ ఓవర్ ల్యాప్ అవుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఏపీ పిటిషన్‌ను తెలంగాణ పిటిషన్ విచారిస్తున్న బెంచ్‌కు బదిలీ చేయాలని చెబుతూ ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రెండు పిటిషన్లు గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.