calender_icon.png 25 April, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశీలకులుగా ఉమ్మడి జిల్లా నేతలకు చోటు

25-04-2025 12:20:25 AM

కరీంనగర్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ అధ్యక్షుల నియామాకం కోసం పార్టీ కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించి బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశనం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల వారీగా పార్టీ పరిశీలకులను నియమించారు.

ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులకు చోటు లభించింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను నిజామాబాద్ పరిశీలకునిగా, పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న మేనేని రోహిల్రావును సిద్ధిపేట పరిశీలకునిగా, పీసీసీ కార్యదర్శి, సీనియర్ నాయకుడు వైద్యుల అంజన్ కుమార్ ను జగిత్యాల జిల్లా పరిశీలకులుగా నియమించారు.

అలాగే మెదక్ జిల్లా పరిశీలకునిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన ఊట్ల వరప్రసాద్ ను, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సంగీతం శ్రీనివాస్, మైనార్టీ నాయకుడు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ ను పెద్దపల్లి జిల్లాకు పరిశీలకులుగా నియమించారు. అలాగే సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ను కామారెడ్డి జిల్లాకు పరిశీలకునిగా నియమించారు.

వీరు ఆయా జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను సమన్వయపరుస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 2017కు ముందు నుంచి పార్టీకి పనిచేస్తున్న వారికి పదవులు ఉంటాయని పీసీసీ ప్రకటించిన నేపథ్యంలో పరిశీలకుల నియామకం కీలకమైంది.

ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నేతలు పరిశీలకుల ముందు బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉన్న కరీంనగర్ జిల్లాకు పరిశీలకులుగా ఎం శ్రీనివాస్, డి రఘునాథ్ రెడ్డిలను పార్టీ నియమించింది.