calender_icon.png 12 October, 2024 | 2:50 PM

సంయుక్త యాక్షన్ షురూ

10-10-2024 12:00:00 AM

వరుస సినిమాలతో అలరిస్తున్న హీరోయిన్ సంయుక్త మీనన్ తొలిసారి ఓ మహి ళా ప్రాధాన్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను యోగేశ్ కేఎంసీ దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ రూపొందిస్తున్న ఈ సినిమాకు కథానాయకి సంయుక్త సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

వెంకీ కుడుముల, కోన వెంకట్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. రానా దగ్గుబాటి క్లాప్‌కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమంలో సురేశ్‌బాబు, జెమినీ కిరణ్, సాహు గారపాటి, చుక్కపల్లి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమాని చేయబోతున్నాం.

మిగతా విషయాలన్ని టీజర్ లాంచ్ సందర్భంగా తెలియ జేస్తాం’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. కథానాయకి హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. ‘ఫీమేల్ లీడ్ ఉన్న కథే.. కానీ దీన్ని హీరో కూడా చేయొచ్చు. అంత మంచి కథ. స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు ఉన్నాయి. నెగిటివిటీ తగ్గించాలనుకున్నప్పుడు, మ్యాన్ పవర్, ఫిజికాలిటీని ఉపయోగించాల్సిన అవసరం లేదు.

స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. అది ఏమిటిన్నదే ఈ కథ’ అని వివరించింది. ‘ఈ సినిమాలో సంయుక్త బ్రెత్ టేకింగ్ స్టంట్స్ చేయబోతున్నారు’ అని చిత్రబృందం తెలిపింది. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ కాగా, ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.