calender_icon.png 30 September, 2024 | 10:49 AM

తెలంగాణ అభివృద్ధికి కలిసిరండి

30-09-2024 02:38:03 AM

మూసీలో మంచినీరు పారించడమే లక్ష్యం

తెలంగాణను స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చాం

ఆస్తులు కాపాడటం ప్రభుత్వం బాధ్యత

శాన్ ఫ్రాన్సిస్కోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ అభివృద్ధికి కలిసిరావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. తద్వారా తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు పెరిగి అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.

మూసీనదిలో మంచినీరు పారించి, పార్కులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోంద న్నారు. ఆస్తులు కాపాడడం ప్రభుత్వం బాధ్య త అని, అందులో భాగంగా చెరువులను రక్షించి భవిష్యత్ తరాలను అందించేందుకు రాష్ర్టంలో చర్యలు చేపట్టామన్నామని వివరించారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భట్టి.. ఆదివారం సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. అభివృద్ధి, స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.

గతంలో ఫ్యూడల్ మనస్తత్వమున్న పాలకుల చేతిలో బందీ అయిన రాష్ట్రాన్ని పూర్తి స్వేచ్ఛయుతంగా మార్చామన్నారు. భవిష్యత్తులో నూ ఈ విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎవరు ఏ భావజాలానైనా వ్యక్తపరిచే వాతావరణాన్ని తెలంగాణలో ఏర్పరిచామని వివరించారు.

చెరువుల్లో ఇళ్ల నిర్మాణాలను ఆపకపోతే..

హైదరాబాద్ అంటేనే రాక్స్.. లేక్స్.. పార్క్స్ అని, అయితే కొంతకాలంగా ఇళ్ల నిర్మాణం పేరిట రాళ్లు కనుమరుగైపోయినట్లు డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. చెరువులను కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నారని విమర్శించారు. ఆ తర్వాత పార్కులు లేకుండా పోయాయన్నారు. చెరువుల్లో ఇళ్ల నిర్మాణాలను ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెను ప్రమాదం వాటిల్లుతుందని భట్టి హెచ్చరించారు.

వందల చెరువులు కనపడకుండా పోయాయన్నారు. మూసీ పునర్జీవ కార్యక్రమంలో భాగంగా నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి పునరావాస చర్యలు చేపడుతున్నామన్నారు. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, వారి పిల్లలు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామ న్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలోని కుటుంబాలు ఆరోగ్యంగా జీవించేం దుకు ఆ నదిని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచన అన్నారు. 

వనరులను పద్ధతి ప్రకారం వినియోగిస్తాం

రాష్ర్టంలోని వనరులను గుర్తించి పద్ధతి ప్రకారం వినియోగిస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. రాష్ర్టంలో విద్య, వైద్యం, సేవారంగాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతామ న్నారు. రాష్ర్ట సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతోపాటు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.