- అధిక రాబడి పేరుతో డబ్బులు వసూలు
- పాపన్నపేటలో కొత్త తరహా మోసం
పాపన్నపేట: అధిక రాబడి ఆశ చూపి కొంతమందిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచిన ఘటన పాపన్నపేట మండలంలో వెలుగు చూసింది. మండలంలో ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల దేవస్థానం పేరుమీద ఉన్న వాట్సాప్ గ్రూప్‌లోకి మోసగాళ్లు చేరి అమాయకులకు తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని ఆశచూపి వారి నుంచి సుమారు రూ.2 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ముందుగా ఈ గ్రూపులో మండలంలో జరుగుతున్న ముఖ్యమైన సమాచారం మరియు ఏడుపాయల వనదుర్గాభవానీకి సంబంధించిన సమాచారాన్ని గ్రూపు సభ్యులకు చేరవేస్తుంటారు.
అయితే గత నెల 28వ తేదీన ట్రస్ట్ ది లైఫ్ పేరిట ఆ గ్రూప్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. హర్షసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిం చేందుకు గాను ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తమ వద్ద ప్రస్తుతం ప్రత్యేక ఆఫర్ ఉందని దరఖాస్తుదారులు 2వేల రూపాయలు తాము పంపిన స్కానర్‌కి పంపిస్తే కేవలం 5 నిమిషాల్లో 18,500 రూపాయలను తిరిగి వారికి పంపుతామని 76720 20853 అనే నంబరు ద్వారా గ్రూప్‌లో మెసేజ్ చేశారు. ఈ మోసంలో భాగంగానే గ్రూప్‌లో అడ్మిన్‌గా ఉన్న వ్యక్తి నుంచి తమకు అడ్మిన్ లాగిన్ ఇవ్వమని అడిగి తీసుకున్నారు.
అలాగే 2వేల రూపాయలు వేసిన వ్యక్తికి రూ.18500 జమచేసినట్టు స్క్రీన్ షాట్‌ను సైతం పెట్టారు. ఏడుపాయల అమ్మవారి పేరున గ్రూప్ ఉండటం, అందులో మోసగాళ్లు వాడుకున్న.. హర్షసాయి (యూట్యూ బర్) నిజంగానే ఎక్కువగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్టు సామాజిక మాధ్యమా ల్లో ప్రచారంలో ఉండటంతో నిజమేనని నమ్మిన సభ్యులు 2వేల రూపాయలను మోసగాళ్లు పంపించిన స్కానర్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఇలా మెదక్ జిల్లాలోనే కాకుండా ఆ గ్రూప్‌లో ఉన్న ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు కూడా మోసగాళ్లు పన్నిన వలలో చిక్కుకుని నగదును పోగొట్టుకున్నట్లు సమాచారం. నగదు వేయగానే ఆ నంబర్‌ను సదరు గ్రూప్ నుంచి రిమూవ్ చేసిన కేటుగాళ్లు.. రిమూవ్ చేసిన వ్యక్తి గ్రూప్‌లో పోస్ట్ చేసిన నంబర్‌ను సంప్రదించగా ఫోన్ స్విచ్చాఫ్ ఉంటుంది.
అడ్మిన్ ఇవ్వమంటారు..అడ్మిన్‌నే తొలగిస్తారు..
ఇదే విధంగా మండలంలో నమస్తే పాపన్నపేట అనే పేరు మీద ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్‌గా ఉన్న అంజాగౌడ్‌కు ఈనెల 5వ తేదీన 9390999349 అనే నంబర్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను కానిస్టేబుల్ అని తనను నమస్తే పాపన్నపేట గ్రూపులో జాయిన్ చేసి అడ్మిన్ ఇవ్వాలని కోరాడు. ఇదంతా నిజమని నమ్మిన అంజాగౌడ్ అతడిని గ్రూప్‌లో జాయిన్ చేయడమే కాకుండా గ్రూప్‌కి అడ్మిన్ చేశాడు. అయితే అతడు గ్రూప్‌లో చేరగానే అంజాగౌడ్‌తో పాటు ఇతర 12 మంది అడ్మిన్లను గ్రూప్ నుంచి తొలగించాడు.
వెంటనే మోసాన్ని గ్రహించిన అంజాగౌడ్ గ్రూప్ ప్రదాన అడ్మిన్‌కు ఫోన్ చేసి జరిగినదంతా వివరించాడు. గ్రూప్ మెయిన్ అడ్మిన్ సదరు వ్యక్తిని గ్రూప్ నుంచి తొలగించాడు. తదనంతరం ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని ఆయన తెలిపారు. గ్రూప్ అడ్మిన్.. సైబర్ మోసాన్ని సకాలంలో గుర్తించడంతో మోసగాడి ప్లాన్‌ను అడ్డుకున్నట్లు అయింది.