calender_icon.png 21 September, 2024 | 6:11 AM

జానీ మాస్టర్ జైలుకు

21-09-2024 12:50:00 AM

చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలింపు  

14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

నిందితుడు నేరం అంగీకరించాడు

రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి

రాజేంద్రనగర్, సెప్టెంబర్20: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఉప్పర్‌పల్లి కోర్టు అక్టోబర్ 3 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. తన అసిస్టెంట్ కొరియాగ్రాఫర్‌పై లైంగికదాడి చేసి బెదిరింపులకు పాల్పడి నట్లు బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీసులకు కేసును బదిలీ చేశారు. ఈ మేరకు జానీ మాస్టర్‌పై లైంగికదాడి, పోక్సో కేసు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు ఈనెల 15వ తేదీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గోవాలోని ఓ హోటల్‌లో అరెస్టు చేశాయి. అక్కడి కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. ఆయనను నార్సింగి పోలీసులు విచారించారు. రాజేంద్రనగర్‌లోని సీసీఎస్‌లో ఆయనను ఇంటరాగేషన్ చేశారనే ప్రచారం జరిగింది. 

14 రోజుల రిమాండ్..

జానీ మాస్టర్‌ను విచారించిన తర్వాత పోలీసులు రహస్య ప్రాంతం నుంచి మధ్యా హ్నం సమయంలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి ఉప్పర్‌పల్లిలోని కోర్టుకు భారీ భద్రత నడుమ తరలించారు. జానీ మాస్టర్‌ను శుక్రవారం కోర్టుకు తీసుకొస్తున్నారనే సమాచారంతో ఉప్పర్‌పల్లిలోని కోర్టు వద్ద ఉదయం నుంచి మీడియా ప్రతినిధులు పడిగాపులు కాశారు. చివరకు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం జానీ మాస్టర్‌ను భారీ భద్రత మధ్య నగరంలోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

రిపోర్టులో కీలక విషయాలు..

జానీ మాస్టర్ రిమాండు రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై ఆయన లైంగికదాడి చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ‘2019లో జానీ మాస్టర్ దురుద్దేశంతోనే బాధితురాలిని తన అసిస్టెంట్‌గా నియమించుకున్నారు. 2020లో ముంబైలోని ఓ హోటల్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగికదాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు16 సంవత్సరాలు. ఈనేపథ్యంలో గత నాలుగేళ్లలో ఆమెపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. చేసిన నేరాన్ని ఆయన అంగీకరించారు. దీంతోపాటు ఆయన బాధితురాలిని బెదిరించారు. ఎక్కడ పని దొరకకుండా చేస్తానని బెదిరించి లొంగదీసుకున్నారు.’ అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.  

నా భర్తను వదిలేస్తా: అయేషా 

ఒకవేళ మహిళా కొరియోగ్రాఫర్‌పై తన భర్త  లైంగికదాడి చేసినట్లు నిరూపిస్తే ఆయనను వదిలేస్తానని జానీ మాస్టర్ భార్య అయేషా అలియాస్ సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు.తన భర్తను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. జానీ మాస్టర్‌ను గోవాలో పట్టుకున్నారనే విష యం తెలుసుకున్న ఆయేషా నార్సింగి ఠాణాకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. జానీ మాస్టర్ భార్య కూడా తనను బెదిరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొనడంతో ఆమెను కూడా పోలీసులు విచారించారు. అందరూ కలిసి కుట్రపన్ని లేడీ కొరియోగ్రాఫర్‌తో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. బాధితురాలికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

తన భర్త జనసేనలో యాక్టివ్‌గా ఉండటంతోనే కావాలని ఇరికించారని ఆమె చెప్పారు. చివరకు న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పోక్సో కేసు ఉండటంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేస్తామని జానీ మాస్టర్ న్యాయవాది తెలిపారు. అయితే జానీ మాస్టర్‌ను విచారిం చేందుకు తగిన సమయం లభించకపోవడంతో నార్సింగి పోలీసులు త్వరలో ఆయన ను కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. పూర్తిస్థాయిలో విచారించను న్నట్లు సమాచారం. కాగా  మరో కొరియోగ్రాఫర్ మాస్టర్ రాము నార్సింగి పోలీస్‌స్టేషన్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ నిజం బయటకు వచ్చాక న్యాయం పక్షాన పోరాడుతామన్నారు.