calender_icon.png 20 September, 2024 | 5:24 AM

గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్

20-09-2024 01:11:45 AM

  1. అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు
  2. అక్కడి కోర్టులో హాజరుపరిచి వారెంట్‌తో హైదరాబాద్ తరలింపు 
  3. బాధితురాలి ఫిర్యాదుతో నార్సింగి పీఎస్‌కు వచ్చిన మాస్టర్ భార్య

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 19: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను గోవాలో సైబారాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై ఆయన్ను నగరానికి తీసుకొస్తున్నారు. నార్సింగి పోలీసులు శుక్రవారం జానీమాస్టర్‌ను రాజేంద్ర నగర్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరుచనున్నారు. జానీ మాస్టర్ తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21) ఆయనపై ఈనెల 15న రాయదుర్గం పోలీసులకు ఫిర్యా దు చేయగా, జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీసులకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

దీంతో ఆయనపై అదేరోజు 1371బై 2024 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు. నిందితుడు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై ఐపీసీ 376(2) ఎన్ 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదైంది. జానీ మాస్టర్ అత్యాచారం చేసినప్పు డు తాను మైనర్‌ను అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేయ డంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

జానీ మాస్టర్ పరారీలో ఉండగా.. అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందా లు రంగంలోకి దిగాయి. ఆయన తొలుత నెల్లూరులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అదేవిధంగా అతడి అరెస్టు విషయంలోనూ గందరగోళం జరిగింది. మొదటగా బెంగళూరులో అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన్ను గోవాలో అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రత్యేక బృందాలు ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలించాయి. 

బాధితురాలి కంప్లుంట్‌తో.. 

జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన 21 ఏండ్ల మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పలు అంశాలను పేర్కొన్నారు. 2017లో తనకు ఓ షోలో జానీ మాస్టర్ పరిచయం అయ్యారని,  ఈనేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరినట్లు పేర్కొంది. 2020లో ముంబైతోపాటు వివిధ ప్రాంతాలకు ఆయనతో తనతోపాటు మరికొందరు వెళ్లినట్లు వివరించింది. ఈనేపథ్యంలోనే జానీ మాస్టర్ ముంబైలోని ఓ హోటల్‌లో తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది. విషయం బయట కు పొక్కితే పనిలోనుంచి తొలగించడంతోపాటు మరెక్కడా పని దొరకకుండా చేస్తానని బెదిరించాడని తెలిపింది.

హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తన కోరికలు తీర్చికున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతోపాటు షూటింగ్ సమయాల్లోనూ తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని బాధితురాలు తెలిపింది. మతం మారి తనను వివాహం చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో వెల్లడించింది. తన కోరికలు తీర్చేం దుకు నిరాకరించగా పలుమార్లు దాడులు సైతం చేశాడని, వేధింపులు తాళలేక తాను జానీమాస్టర్ వద్ద నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొంది. ఈక్రమంలోనే తనకు వేరే ప్రాజెక్టులు రాకుండా తీవ్ర ఇబ్బందులపాలు చేశాడని చెప్పింది. ఆగస్టు 28న నార్సింగిలోని తన ఇంటి గుమ్మానికి గుర్తుతెలియని వ్యక్తులు ఓ పార్సిల్ వేలాడదీశారని, అందులో ‘మగబిడ్డకు అభినందనలు, కానీ జాగ్రత్తగా ఉండు’ అని అందులో ఉందని బాధితురాలు తెలియజేసింది. 

నార్సింగి పీఎస్‌కు జానీ మాస్టర్ భార్య

జానీ మాస్టర్‌తోపాటు ఆమె భార్య ఆయేషా అలియాస్ సుమలత తనను ఇబ్బంది పెట్టిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయేషా గురువారం మధ్యా హ్నం నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు తనతో మాట్లాడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు ఆయేషా తెలిపారు. అయితే జానీ మాస్టర్‌పై కేసుతోపాటు అరెస్టు తదితర అంశాలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వలేదు. తనకు ఓ ఫేక్ కాల్ వచ్చిందని, ఆ విషయమై పీఎస్‌కు వచ్చినట్లు చెప్పడం గమనార్హం. 

మహిళా కమిషన్‌కు ఫిర్యాదు 

జానీ మాస్టర్ అత్యాచారం కేసు వ్యవహారం మహిళా కమిషన్ దృష్టికి వెళ్లింది. ఈ మేరకు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై మహిళా కమిషన్‌లోనూ కేసు నమోదైంది. బాధిత యువతిని పలు మహి ళా సంఘాలు కలిసి భరోసా కల్పించాయి. అనంతరం తనకు జరిగిన అన్యాయంపై వివరిస్తూ బాధితురాలు 40 పేజీలతో కూడిన లేఖను మహిళా కమిషన్‌కు అందజేసి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ జరిపి న్యాయం చేస్తామని మహిళా కమిషన్ హామీ ఇచ్చింది.