24-02-2025 11:13:13 PM
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా డి. జోయెల్ డేవిస్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీగా డాక్టర్ గజరావు భూపాల్‌లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా పనిచేస్తున్న జోయెల్ డేవిస్ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా బదిలీ కాగా, ఆ స్థానంలో 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ గజరావు భూపాల్ బదిలీపై వచ్చారు. ఈ మేరకు వీరిరువురు ఆయా స్థానాలలో సోమవారం బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాహనదారులు సురక్షితంగా, సాఫీగా ప్రయాణం చేసేలా ట్రాఫిక్ అధికారులకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపర్చడానికి సాంకేతికత అంశాలను పరిగణనలోకి తీసుకొని మెరుగైన రహదారి భద్రతా చర్యలు తదితర కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అనంతరం సైబరాబాద్ సీపీ అవినాష్ మహాంతిని డాక్టర్ గజరావు భూపాల్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లను జోయెల్ డేవిస్‌లు మర్యాదపూర్వకంగా కలిసారు.