- ద్వితీయశ్రేణి పట్టణాల్లో పరిశ్రమల ఏర్పాటు
- ఏరోస్పేస్‌లో అపారమైన అవకాశాలు
- ఎంఎస్‌ఎంఈ పాలసీతో ప్రోత్సాహకాలు
- ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్/మహేశ్వరం, నవంబర్ 21 (విజయ క్రాంతి): రూ.300 కోట్ల వ్యయంతో నిర్మితమయ్యే రఘువంశీ ఏరోస్పేస్ పరిశ్రమ ద్వారా రానున్న మూడేళ్లలో 1,200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణ చేపట్టిందని తెలిపారు. గురువారం శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో రఘువంశీ ఏరోస్పేస్ కొత్త కర్మాగారం నిర్మాణానికి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. గత దశాబ్దన్నర కాలంలో ఏరోస్పెస్‌లో అపారమైన అవకాశాలు వచ్చాయన్నారు.
హార్డ్‌వేర్ పార్కు, ఫ్యాబ్‌సిటీ, ఫోర్త్‌సిటీలో అనేక అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయని.. భవిష్యత్‌లో కూడా అనేక కంపెనీలు రాబోతున్నాయని తెలిపారు. కంపెనీలు రావడం వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.కంపెనీలకు అనుగుణంగా యువత యువకులు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని సూచించారు.
రఘువంశీ సంస్థ చేతిలో ఉన్న రూ.2 వేల కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన సముదాయంలో ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. ఎయిర్ బస్ ఏ320, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఇంజన్లకు, జీఈ ఏరోస్పేస్, రోల్స్ రాయిస్, ప్రాట్ అండ్ విట్నీ, సఫ్రన్, హానీవెల్ విమాన ఇంజన్లను తయారు చేసే సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేస్తుందని వెల్లడించారు.
2002లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు ఫ్యూయల్ పంపులు, ల్యాండింగ్ గేర్ల లాంటి ముఖ్య పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరి ఏరోస్పేస్ రంగంలో రాష్ర్ట ప్రతిష్టను ఇనుమడింప చేసిందని ప్రసంసించారు.
ఎంఎస్‌ఎంఈ పాలసీతో ప్రోత్సాహకాలు..
డీఆర్‌డీవో, ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, బీడీఎల్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలకు పరికరాలు, విడిభాగాలను రఘువంశీ ఏరోస్పేస్ అందజేస్తోందని వివరించారు. ముడి చమురు, సహజ వా యువును వెలికితీసే పరిశ్రమలకు, ఆరోగ్య రంగంలో వినియోగించే పరికరాలను తయారు చేస్తోందని తెలిపారు.
హైదరాబాద్ ఏరోస్పేస్ ఎస్‌ఈజెడ్‌లో టాటా, భారత్ ఫోర్జ్, అదానీ లాంటి ప్రఖ్యాత కంపెనీలు సంయుక్తంగా వైమానిక, రక్షణ, అంతరిక్ష వాహనాల ఉత్పత్తులను తయా రు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏరోస్పేస్ సంస్థలకు రకరకాల విడిభాగాలను అందించే 1,500 సూక్ష్మ, చిన్న, మధ్య తర హా పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు.
రాష్ర్ట ప్రభు త్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్‌ఎం ఈ పాలసీ ప్రకారం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో రఘువంశీ ఏరోస్పేస్ డైరెక్టర్ వంశీ వికాస్, డీఆర్‌డీవో క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ రాజబాబు, సీఐఐ చైర్మన్ డా.సాయి ప్రసాద్, టీజీఐఐసీ ఎండీ డా. విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ర్ట ఏరోస్సేస్, డిఫెన్స్ విభాగం డైరెక్టర్ పీఏ ప్రవీణ్, టీజీఐఐసీ సీఓఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.