11-04-2025 12:00:00 AM
తరగతులను బహిష్కరించిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు
జీవో నెం.21ను వెంటనే ఉపసంహరించుకోవాలి
వర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రా క్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన బంద్ విజయవంతమైంది. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీసులను క్రమబద్ధీకరణ, బేసిక్ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, 3 శాతం వార్షిక పెరుగుదలతో కూడిన వేతనం ఇవ్వాలనే డిమాండ్‌తో 12 యూనివర్సిటీల బంద్‌కు జేఏసీ పిలుపునచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగం గా గురువారం వర్సిటీల్లో విద్యా కార్యకలాపాలు నిలిచిపోయాయి. కాంట్రాక్ట్ అసిస్టెం ట్ ప్రొఫెసర్లు తరగతులను బహిష్కరించారు. పరిపాలనా కార్యాలయాలు పాక్షికం గా మూసివేయబడ్డాయి. ఈనెల 9న హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామం డలి కార్యాలయ ముట్టడి నేపథ్యంలో పోలీసుల అనైతిక అరెస్టులను జేఏసీ నేతలు డా.ఏ.పరశురామ్, డా.డీ.ధర్మతేజ, డా.వేల్పు ల కుమార్ తీవ్రంగా ఖండించారు.
తమ డిమాండ్‌ల పరిష్కారానికి గత పదిహేను నెలలుగా ప్రజా ప్రతినిధులు, అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఫలితంలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీల్లోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నెం.21తో తమ ఉద్యోగాలకు అభద్రత ఏర్పడిందని, ఆ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభత్వుం తమ సమస్యలపట్ల సానుకూలంగా ఉన్నా కొంతమంది అధికారులు నష్టం చేయాలనే దురుద్ధేశంతో ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గత మూడు రోజులుగా జీవో 21కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలుపుతూ గురువారం చేపట్టిన బంద్‌ను అధ్యాపకవర్గం విజయవంతం చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, తమ దీర్ఘకాల డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. లేకుంటే రానున్న రోజుల్లో విద్యార్థి సంఘా లు, పౌర సమాజం, ఇతర సంఘాలతో తమ ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.