19-03-2025 05:12:55 PM
తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్వోజు వెంకటేష్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): నిరుద్యోగ కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్వోజు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నకిరే కంటి కిరణ్ కుమార్, గ్రేటర్ ఇన్చార్జి ప్రవీణ్ కుమారులు మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పాటుపడి రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించి గత కేసిఆర్ ప్రభుత్వంలో అన్యాయానికి గురైనటువంటి ఎంతోమంది కళాకారులు బతుకులు చిన్నాభిన్నమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాల కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారధిలో అన్యాయమైనటు వంటి కళాకారులు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ గోడును వినకపోగా కాలయాపన చేస్తూ పది సంవత్సరాలు నరకయాతన చూపించారన్నారు. అదే సందర్భంలో గాంధీభవంలో అప్పటి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవగానే వారు స్పందించి మన ప్రజా పాలన ప్రభుత్వం రాగానే ప్రజా ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని, ప్రజా పాలన వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికిని సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని వారు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారధి లో కేవలం 550 ఉద్యోగాలచే పరిమితం చేస్తూ ఆనాటి చైర్మన్ రసమయ బాలకిషన్ చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనల వలన ఎంతోమంది కళాకారులు నేడు రోడ్డుపైన పడ్డారని ఆయన అన్నారు.
కళాకారులను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వెంటనే తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ బడ్జెట్ సమావేశాలలో కళాకారుల గురించి ప్రస్తావించినట్లయితే అతి తొందరలో కార్యాచరణ రూపొందించి 33 జిల్లాల్లోని కళాకారులను ఏకం చేస్తూ ఇందిరా పార్క్ ధర్నాకు పిలుపునివ్వడం జరుగుతుందని, కళాకారుల కన్నీటి దీక్ష ప్రారంభించి ప్రభుత్వానికి కళాకారుల యొక్క గోస తెలిసే విధంగా ప్రణాళికలు ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పేరాల యాదగిరి, డాక్టర్ సలీం, నకరి కంటి చిరంజీవి, పున్న రమేష్, రాజేష్, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.