calender_icon.png 6 October, 2024 | 8:55 AM

ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలు భర్తీచేయాలి

05-10-2024 01:31:20 AM

టీచర్ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ కోటాను పక్కనపెట్టాలి

సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోని మాదిగలు విజ్ఞప్తి 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మేరకే ఎస్సీలకు కేటాయించే ఉద్యోగాలను భర్తీ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోని మాదిగ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు శుక్రవారం ‘సాష్టాంగ నమస్కారం’ పేరుతో జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటి ముందు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు. ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో టీచర్ ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చినా ఎస్సీలకు సంబంధించి 15 శాతం వాటాను పక్కన పెట్టాలని, వర్గీకరణపై తుది నిర్ణయం తీసుకున్నాకే భర్తీ చేయాలని కోరారు.

చెరువులు, కుంటలు, బఫర్ జోన్‌లోని భూములను హైడ్రా పెట్టి కాపాడినట్లుగానే.. మాదిగలకు వచ్చే వర్తించాల్సిన ఉద్యోగాలను ఇతరులు కబ్జా చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి కాపాడాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా న్యాయపరమైన చిక్కులు సీఎంను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ న్యాయపరమైన చిక్కులుంటే వాటిని సరిచేసి, వర్గీకరణ మేరకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.