calender_icon.png 20 April, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లలో 500 మందికి ఉద్యోగాలు

20-04-2025 01:08:00 AM

సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనలో ముందుకొచ్చిన టెర్న్, రాజ్ గ్రూప్ కంపెనీలు

  1. టామ్‌కామ్‌తో ఒప్పందం
  2. హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, నిర్మాణ రంగాల్లో అవకాశం

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయ క్రాంతి): తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) సంస్థ తాజాగా రెండు జపాన్ కంపెనీలతో కలిసి పనిచేయబోతున్నది. జపాన్ పర్యటనలో భాగంగా శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో టెర్న్(టీజీయూకే టెక్నాలజీస్ ప్రై.లి), రాజ్ గ్రూప్ కంపెనీలతో టామ్‌కామ్ ఒప్పందం చేసుకున్నది.

జపాన్‌లోని ఆయా రంగాల్లో పెరుగుతు న్న శ్రామిక శక్తి డిమాండ్‌ను తీర్చడానికి తెలంగాణ నుంచి నైపుణ్యం ఉన్న మానవవనరుల నియామకాన్ని సులభతరం చేసే లక్ష్యంతో ఈ ఒప్పందం జరిగింది. టెర్న్, రాజ్ గ్రూప్ కంపెనీలు రాబోయే రెండేళ్లలో తెలంగాణ నుంచి 500 మందికి ఉపాధి కల్పించనున్నాయి.

ఇందులో భాగంగా హెల్త్‌కేర్ రంగంలో 200, ఇంజినీరింగ్ రంగంలో 100, హాస్పిటాలిటీ రంగంలో 100, నిర్మాణ రంగంలో 100 మందికి ఉపాధి లభించనున్నది. ఈ ఒప్పం దం ద్వారా జపాన్‌లో ఉపాధి లభించే దీర్ఘకాలిక సహకారానికి మార్గం సుగమం అవు తుందని టామ్‌కామ్ ప్రతినిధులు భావిస్తున్నారు. దీంతో నాణ్యమైన మానవవనరులు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. 

ఉద్యోగ.. ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయం

  1. ఎన్‌ఆర్‌ఐలు పుట్టిన గడ్డకు సేవ చేయాలి
  2. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి
  3. జపాన్‌లో ‘తెలుగు సమాఖ్య’ ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయ క్రాంతి): తెలంగాణ యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఆ లక్ష్యంతోనే ఎంఎన్‌సీ కంపెనీలు, పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జపాన్ పర్యటనలో భాగంగా శనివారం ఆయన అక్కడి తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఇష్ఠాగోష్ఠిలో పాల్గొన్నారు.

ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్రాభి వృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. సాయం చిన్నదైనా ఫర్వాలేదని, మంచి మనసుతో చేసే పని సంతృప్తినిస్తుందన్నారు. జన్మభూమికి సేవ చేయడంలో ఎంతో అనందం లభిస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీ నగరంలో వాయుకాలుష్యం కనీ విని ఎరుగని రీతిలో ఉందని, ఫలితంగా విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నదని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రావొద్దనే తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు పూనుకున్నదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొందరు పనిగట్టుకుని విషం కక్కుతున్నారని మండిపడ్డారు. అలాగే మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.