calender_icon.png 7 March, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోర్త్ సిటీలో స్థానికులకే ఉద్యోగాలు!

07-03-2025 01:03:21 AM

  • పరిశ్రమల కోసం భూములు ఇచ్చే రైతులకు అండగా ఉంటాం

లెన్స్ కార్ట్ కళ్లజోళ్ల ప్లాంట్ ఏర్పాటుతో 2వేల మందికి ఉపాధి

రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తుక్కుగూడలో లెన్స్‌కార్ట్ ప్లాంట్, నూతన డీసీపీ కార్యాలయాలకు శంకుస్థాపన

తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు

హైదరాబాద్/ రంగారెడ్డి, మార్చి 6 (విజయక్రాంతి): ఫోర్త్ సిటీలో ఏర్పాటు అయ్యే పరిశ్రమల ద్వారా స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, రంగారెడ్డి ఇన్‌చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భరోసా కల్పించారు.

గురువారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో ఆవరణలో నూతన డీసీపీ కార్యాలయం, పోలీస్ భవనాలు, జెన్నాయిగుట్ట సమీపంలో  లెన్స్ కార్ట్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబుతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తుక్కుగూడలో లెన్స్ కార్ట్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 52 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు చేప్పారు.

రూ.1,500 కోట్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళ్లజోళ్ల పరిశ్రమల వల్ల దాదాపు 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పరిశ్రమల కోసం భూములు ఇచ్చే రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారికి ప్లాట్లు, భూ పరిహారంతో పాటు వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. 

‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కండి

‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులున్నాయన్నారు. పారి శ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లజోడుల తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు లెన్స్‌కార్ట్ ముందుకురావడం అభినందనీయమన్నారు. దీంతో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం అవుతుందన్నారు. 

శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు

 రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభు త్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో డీసీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు ప్రభు త్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందన్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న కమిషనర్ సుధీర్‌బాబు, సంబంధిత అధికారులను అభినందించారు. కార్యక్రమంలో రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, డీసీపీ సునీతారెడ్డి, కాంగ్రెస్ మహేశ్వరం ఇన్‌చార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, లెన్స్ కార్ట్ ప్రతిని ధులు చౌదరి, సుమిత్ తదితరులు పాల్గొన్నారు.