calender_icon.png 26 October, 2024 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

శిక్షణతో ఉపాధికి న్యాక్ రక్షణ!

06-08-2024 02:00:32 AM

  1. నిర్మాణ రంగంలో దక్షిణాసియాలోనే ఏకైక సంస్థ  
  2. ప్రభుత్వ ఆధ్వర్యంలో లక్షల మందికి ఉపాధి కల్పన 
  3. న్యాక్ కోర్సులకు భారీ డిమాండ్

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): లక్షలు ఖర్చుచేసి చదువులు పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి అందని ద్రాక్షలా మారిన రోజులివి. ఉద్యోగం, ఉపాధికి చేయూతనిస్తాం అంటోంది హైదరాబాద్ నేషనల్ అకాడమీ ఫర్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) సంస్థ. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎంత చదివినా పర్వాలేదు. విద్యార్హతలను బట్టి పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించేందుకు కృషి చేస్తుంది.

నిర్మాణ రంగాల్లోని ప్లంబింగ్, పెయింటింగ్, ఫాల్ సీలింగ్, ఎలక్ట్రిషియన్, జనరల్ వర్క్స్ సూపర్వుజర్, ల్యాండ్ సర్వేయర్, స్టోర్ కీపర్ తదితర విభాగాలతోపాటు మహిళలకు టైలరింగ్, పెయింటింగ్ వంటి శిక్షణ కోర్సులను ఉచితంగా అందిస్తుంది. న్యాక్‌లో 20 శాతం శిక్షణ, 80 శాతం ప్రాక్టికల్స్ ఉంటాయి. 1998లో హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ రంగంలో దక్షిణాసియాలో ఉన్న ఏకైక సంస్థ ఇది.

దీన్ని అప్పటి ఏపీ సర్కారు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) సంయుక్తంగా ఏర్పాటు చేశారు. న్యాక్‌కు హైదరాబాద్ తోపాటు సంగారెడ్డి, సిద్ధిపేట, గోదావరిఖని, జగిత్యాల, నల్లగొండ, ఇల్లందు, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాల్లోని కేంద్రాలు స్థానికంగా కార్మికులకు సాంకేతిక, నైపుణ్య శిక్షణా ప్రోగ్రాములు అందిస్తున్నాయి.

ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఒప్పందాలు 

నైపుణ్య శిక్షణకు సంబంధించి న్యాక్‌కు ఐఐటీ హైదరాబాద్, ఎన్‌ఐటీ వరంగల్, మహింద్రా యూనిర్సిటీతో ఒప్పందాలు ఉన్నాయి. వివిధ కోర్సులకు సంబంధించి ఈ సంస్థలు తమ విద్యార్థులకు న్యాక్‌లో శిక్షణ అందించేందుకు ఎంఓయూ చేసుకున్నాయి.

వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు సైతం తమ విద్యార్థులను న్యాక్‌కు పంపిస్తున్నాయి. విదేశీ విద్యార్థులు సైతం ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. జేసీబీ, జాగ్వార్, ఎల్‌అండ్ టీ, సెయింట్ గోబిన్, ష్నేడర్, ఏసియన్ పెయింట్స్, గోద్రెజ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు న్యాక్ తో కలిసి పనిచేస్తున్నాయి. 

న్యాక్ అందించే కోర్సులివే 

న్యాక్ అనేక శిక్షణ కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తోంది. నైపుణ్యాభివృద్ధి, నైపుణ్యాల పునరుద్ధరణ, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్, పీజీ డిప్లోమా కోర్సులు (కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, సర్వేయింగ్, కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ) సహా పలు వృత్తి సంబంధిత శిక్షణ ప్రోగ్రాంలు అందిస్తుండగా.. అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్, ప్లంబర్, వెల్డర్, ఫాల్స్ సీలింగ్, కార్పెంటర్ తదితర కోర్సులు నిరుద్యోగులకు వరంగా మారాయి.

వీటిలో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సేఫ్టీ మేనేజ్‌మెంట్ వంటి విభాగాలు ఉన్నాయి. వివిధ కోర్సులు, శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాప్‌ల ద్వారా నిరుద్యోగుల్లో స్కిల్స్ పెంపొందిస్తున్నారు. 3 నెలలు, 5 నెలలు, ఏడాది కాలవ్యవధిలో  కోర్సులు ఉంటాయి.

ఆధునిక సౌకర్యాలు, ల్యాబ్స్, శిక్షణా కేంద్రాలు స్కిల్స్ పెంచేందుకు తోడ్పడుతున్నాయి. పీఎంవీకేవై, డీడీ యూ జీకేవై, టీజీబీఓసీడబ్ల్యూడబ్ల్యూబీ సహకారంతో న్యాక్ ఉచితంగా శిక్షణ అందిస్తుం ది. భోజనం, వసతి సైతం ఉచితంగా అందిస్తారు. వివరాల కోసం కొండాపూర్‌లోని న్యాక్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదా www.nac.edu.in సంప్రదించవచ్చు. 

మంచి ప్యాకేజీలు..  

హైదరాబాద్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయని న్యాక్ అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు న్యాక్ అందించే శిక్షణ అనంతరం వారికి జేఎన్టీయూ నుంచి సర్టిఫికెట్లు అందిస్తున్నారు.

సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థులకు మిగతా ఇంజినీరింగ్ విద్యార్థుల కన్నా మెరుగైన ప్యాకేజీలు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు న్యాక్‌లో 5,72,౦00 మంది శిక్షణ పొందారు. వీరంతా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలతోపాటు స్వయం ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 1,70,000 మందికి న్యాక్ శిక్షణ ఇచ్చింది. ఇందులో ఇంజినీరింగ్ సివిల్ విద్యార్థుల సంఖ్య 14 వేలు.

మిగతా వారంతా నిర్మాణ రంగ కార్మికులే. జీహెఎంసీ, టీఎస్టీడీసీ వంటి ప్రభుత్వ సంస్థలకు సైతం న్యాక్ నుంచి నేరుగా ఉద్యోగులను అందించారు. టాటా, జీవీకే, జీఎంఆర్, అపర్ణ, మైహోం, షాపూర్ జీ పల్లోంజీ, కిర్బి, రాంకీ, మేఘా వంటి అనేక ప్రైవేటు కన్‌స్ట్రక్షన్ కంపెనీలు న్యాక్ లో శిక్షణ పొందిన వారిని తమ ఉద్యోగులుగా నియమించుకునేందుకు ఎదురుచూపులు చూస్తాయి. 

  • 8 విభాగాల ద్వారా శిక్షణ  
  • కన్‌స్ట్రక్షన్  డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఐ) 
  • కన్‌స్ట్రక్షన్  టెక్నీషియన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (సీటీటీఐ)
  • హౌసింగ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌డీఐ)
  • వాటర్ రీసోర్ట్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యూఆర్డీఐ)
  • ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ (ఇఏడీ)
  • కన్‌స్ట్రక్షన్ ఇన్ మెటీరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఆర్‌ఐ)
  • ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీజీ సైన్స్ (పీజీ బ్లాక్)
  • పీజీ డిప్లొమా ఇన్ కన్‌స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ (పీజీసీపీఎం)

* ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మీద 50 శాతం ఆధారపడితే నిర్మాణ రంగంపై 42 శాతం జనాభా ఆధారపడుతోంది. ఇక నిర్మాణ రంగంలో ప్రపంచ జీడీపీ 13 శాతం ఉంటే ఇందులో మన దేశ జీడీపీ 9 శాతం ఉంది. కీలకమైన నిర్మాణ రంగంపై దేశంలో 7.1 కోట్ల మంది ఆధారపడుతుంటే ఇందులో నైపుణ్యం ఉన్న కార్మికుల సంఖ్య కేవలం 19 శాతం మాత్రమే. ఇక తెలంగాణలో  స్థానికులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కలిపి నిర్మాణ రంగంలో 1.60 కోట్ల మంది పనిచేస్తున్నారు.

వీరిలో స్థానికులు 16 లక్షల మంది మాత్రమే కావడం గమనార్హం. వీరిలో సింహ భాగం ఎలాంటి శిక్షణ లేనివారే కావడంతో నిర్మాణరంగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. న్యాక్ శిక్షణ వల్ల ఇండస్ట్రీకి, కార్మికులకు మేలు జరుగుతోంది. భవిష్యత్తులో నిర్మాణ రంగాన్ని నమ్ముకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నిర్మాణ రంగానికి అవసరమైనట్టు తీర్చిదిద్దుతాం 

న్యాక్ ద్వారా ఏటా 30 వేల మందికి శిక్షణ అందిస్తున్నాం. ఈ ఏడాది 50 వేల మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఏర్పా టు చేసుకున్నాం. అన్ని ట్రేడ్‌లకు సంబంధించి 30 మందితో బ్యాచ్ ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తాం. వారికి ఓ ఇన్‌స్ట్రక్టర్, డిమాన్‌స్ట్రేటర్ ఉంటారు. ప్రతి విద్యార్థి ఇక్కడ సంపూర్ణంగా శిక్షణ పూర్తి చేసుకుని వెళ్తాడు. చాలా మంది ఇక్కడే ప్లేస్‌మెంట్స్ పొందుతారు.

మరికొందరు స్వయం ఉపాధి ద్వారా వారితో పాటు మరికొందరికి ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. ఇండస్ట్రీకి నైపు ణ్యం ఉన్న వారి అవసరం చాలా ఉంది. ఇక్కడ శిక్షణ పొందితే తప్పనిసరిగా వారు జీవితంలో విజయవం తంగా స్థిరపడతారు. ఇంజినీరింగ్, పీజీ డిప్లమో చేసిన విద్యార్థులను క్యాంపస్ సెలక్షన్ ద్వారా నియమించుకుంటారు. కష్టపడి జీవితంలో స్థిరపడాలనుకునే యువతకు న్యాక్ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుంది.

 డా. రాజిరెడ్డి, 

డైరెక్టర్, న్యాక్, హైదరాబాద్

నెలకు రూ.లక్ష వరకు సంపాదిస్తున్నా 

నేను 2021లో న్యాక్‌లో ప్లంబర్‌గా శిక్షణ పూర్తి చేసుకున్నా. బయట ఉద్యోగ అవకాశాలున్నా నేను స్వయం ఉపాధి వైపే మొగ్గుచూపాను. హైటెక్ సిటీ ప్రాంతంలో ప్లంబింగ్ షాపు ఏర్పాటు చేసుకున్నా. స్థానికంగా ప్లంబింగ్ పనులు చేస్తూ నెలకు రూ.లక్ష వరకు సంపాదించుకుంటున్నా.

నాతో పాటు మరో ముగ్గురికి ఉపాధి కూడా కల్పిస్త్నున్నాను. నేను జీవితంలో స్థిరపడేందుకు న్యాక్ ఎంతో ఉపయోగపడింది. యువత న్యాక్‌లో చేరితే అనేక అవకాశాలున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే  నిర్మాణ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదువ లేదు. 

వెంకటేష్, 

అడవిదేవుల పల్లి, నల్గొండ జిల్లా