calender_icon.png 30 January, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ నోటిఫికేషన్ నిబంధనల సడలింపు కుదరదు!

30-01-2025 02:11:43 AM

తేల్చి చెప్పిన హైకోర్టు

హైదరాబాద్, జనవరి 29, విజయక్రాంతి: ఉద్యోగాల భర్తీకి వెలువడే నోటిఫికేషన్ నిబంధనల మేరకు అభ్యర్థులు వ్యవహరించాలని, నిబంధనల్లో సడలింపులు కోరడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. గిరిజన సంక్షేమశాఖ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ తేదీ నాటికి ఇన్‌కం ట్యాక్స్ డాక్యుమెంట్లు అందజేయాల్సిందేనని వెల్లడించింది.

నోటిఫికేషన్ తేదీ వాటి ఆదాయ పు పన్ను ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించకుండానే, ఆ తరువాత సంవత్సరంలో అనుమతించాలంటూ వేసిన అప్పీల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. గిరిజన సంక్షేమ శాఖలోని పోస్టుల భర్తీకి టీజీ పీఎస్సీ 2022లో నోటిఫికేషన్ ఇచ్చింది. భర్తీకి సంబంధించి తాత్కాలిక జాబితా 2024 విడుదల కాగా, సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు 2021 ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని సూచించింది.

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ పోస్టుకు దరఖాస్తు చేసిన సిద్దిపేటకు చెందిన కే తిరుపతి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు 2022 2023 24కి సంబంధించిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించగా, టీజీపీఎస్సీ వాటిని నిరాకరించింది. దీనిని సవాల్ చేస్తూ తిరుపతి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను గతంలో సింగిల్ జడ్జి డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన అప్పీల్‌ను జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ ఏ లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.

ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ప్రస్తుత సంవత్సరాలకే జారీ చేయాలని, గతేడాదికి విడుదల చేయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఈ కారణంగా 2021 సర్టిఫికెట్లు సమర్పించలేదన్నారు.

ఈనిపై టీజీ పీఎస్సీ కౌన్సిల్ ప్రతివాదన చేస్తూ, రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ 2021 సర్టిఫికెట్ సమర్పించారని గుర్తుచేశారు. జీవోలు 243, 244, 65 ప్రకారం సర్టిఫికెట్ సమర్పించాలని నోటిఫికేషన్‌లోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనల తర్వాత అప్పీల్‌ను డివిజన్ బెంచ్ డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది.