అటెండర్లు, డ్రైవర్లుగా హౌసింగ్ కీపింగ్ సిబ్బంది
మేయర్, మాజీ మేయర్ తీరుపై సర్వత్రా విమర్శలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి) ః హైదరాబాద్ మహా నగరానికి ప్రథమ పౌరురాలిగా ఆదర్శంగా నిలవాల్సిన మేయర్.. అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన అధికార దర్పాన్ని అడ్డు పెట్టుకుని బల్దియాలో పనిచేయాల్సిన సిబ్బందిని తన ఇంట్లో సొంత పనులకు వాడుకుంటున్నట్లు సమాచారం. పండుగలు, వేడుకల సందర్భాలతో పాటు తన ఇంటికొచ్చే రాజకీయ ప్రముఖులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా జీహెచ్‌ఎంసీ సిబ్బందితోనే చక్కబెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్దియాకు చెందిన హౌజ్ కీపింగ్ స్టాఫ్ ప్రస్తుత మేయర్, మాజీ మేయర్ ఇంట్లో పనిచేస్తూ బల్దియా అకౌంట్‌లో జీతం పొందుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.
ఉద్యోగం అక్కడ... జీతం ఇక్కడ
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బిల్డింగ్ మెయింటెనెన్స్ సెక్షన్‌లో సుమారు 60 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం క్లీన్‌గా, నీట్‌గా ఉండేలా నిరంతరం శ్రమిస్తుంటారు. నిరంతరం కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా జాడు కొట్టడం, మాఫ్ చేయడం, టాయిలెట్లు క్లీన్ చేయడం వంటి పనులు చేస్తుంటారు.
అయితే, జీహెచ్‌ఎంసీ హౌజ్ కీపింగ్ విభాగం నుంచి జీతం పొందుతున్న వీరు ప్రస్తుత మేయర్, మాజీ మేయర్ నివాసాల్లో ఇంటి పనులు చేస్తున్నట్లుగా సమాచారం. మేయర్ ఇంటికి రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలు వచ్చే సమయంలో ముందస్తుగా వెళ్లి పనులు చక్కబెట్టాల్సి వస్తుందని సదరు సిబ్బంది చెబుతున్నారు. హౌస్ కీపింగ్ సెక్షన్‌లో పనిచేయాల్సిన సిబ్బంది ఇతరత్రా పనులకు వెళ్లడం వల్ల మాపై పనిభారం పడుతోందంటూ ప్రధాన కార్యాలయంలో పనిచేసే వారు వాపోతున్నారు.
ఏజెన్సీ జాబితాలో చేర్చి..
వాస్తవానికి మాజీ మేయర్ నివాసంలో పనిచేసే రవి, సుమిత్రలను జీహెచ్‌ఎంసీ హౌస్ కీపింగ్ ఏజెన్సీ జాబితాలో చేర్చి ఐదేళ్ల పాటు జీహెచ్‌ఎంసీ నుంచి జీతం అందజేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పదవి కాలం పూర్తయినా సదరు సిబ్బందిని మాజీ మేయరే తన ఇంట్లో పనులకు వినియోగిస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల ఏజెన్సీ నుంచి పీఎఫ్‌కు కూడా దరఖాస్తు చేసినట్టుగా తోటి సిబ్బంది చెబుతున్నారు. నూతన పాలక వర్గం మారిన తర్వాత సుమిత్ర అనే మహిళా ఉద్యోగి ప్రస్తుత మేయర్ నివాసంలో పనిచేస్తున్నట్టుగా సమాచారం.
ప్రస్తుతం సుమిత్ర పేరు హౌస్ కీపింగ్ జాబితాలో లేకపోవడంపై తోటి సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈమెను ఇంకా ఏదైనా సెక్షన్‌కు మా ర్పు చేశారా, ప్రస్తుతం జీతం ఏ సెక్షన్ నుంచి క్లుయిమ్ చేస్తున్నారనే సందేహాలు లేవనెత్తు తున్నారు. ఈ విషయంపై సదరు ఏజెన్సీ కాంట్రాక్టర్‌ను వివరణ కోరగా తనకు తెలీదంటూ, గుర్తు లేదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.
దశాబ్దానికి పైగా అదే కుర్చీలో..
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేసేవా ళ్లు రెండు నుంచి మూడేళ్లు దాటగానే బదిలీ అవుతుంటారు. కానీ, బల్దియాలో ప్రధాన కార్యాలయం నిర్వహణ సెక్షన్ అధికారి దశాబ్ద కాలానికి పైగా అదే కుర్చీలో కొనసాగుతుండటం విశేషం. ఏఈ నుంచి డీఈగా, డీఈ నుంచి ఈఈగా ఒకే ప్లేస్‌లో ప్రమోషన్లు పొందుతూ అక్కడి నుంచి మాత్రం కదలడం లేదు. ప్రస్తుతం ఏఈగా పనిచేసే ఓ అధికారి 7 ఏళ్లుగా ఇదే సెక్షన్‌లో కొనసాగుతున్నారు.
ఇనాళ్ల పాటు ఒకే సెక్షన్‌లో, ఒకే పోస్టులో ఎలా కొనసాగుతారం టూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సెక్షన్‌కు సంబంధించిన ఔట్ సోర్సింగ్ స్టాఫ్‌ను దశాబ్ద కాలానికి పైగా ఒకే ఏజెన్సీ అందించడం విశేషం. జీహెచ్‌ఎంసీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది మేయర్, మాజీ మేయర్ నివాసాలలో పనిచేస్తున్నారనే విషయంపై సంబం ధిత సెక్షన్ అధికారులను వివరణ కోరగా, అలాంటిదేమీ లేదంటూ బదులిచ్చారు.