calender_icon.png 11 October, 2024 | 5:55 AM

ఏఐతో ఉద్యోగ కోతలుండవ్

26-08-2024 12:30:00 AM

కొత్త టెక్నాలజీపై క్లయింట్ల ఆసక్తి l ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్

న్యూఢిల్లీ, ఆగస్టు 25: కొత్త టెక్నాలజీ జెనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) పట్ల క్లయింట్లు అమితమైన ఆసక్తి కనపరుస్తున్నారని, ఇన్ఫోసిస్‌లో కూడా పెద్ద ఎత్తున జెన్ ఏఐని అనుసరిస్తున్నామని ఆకంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ చెప్పారు. ఇటువంటి కొత్తతరం టెక్నాలజీలతో తమ కంపెనీలో ఎటువంటి ఉద్యోగ కోతలు ఉండవని స్పష్టం చేశారు. పీటీఐ వార్తా సంస్థతో ఒక తాజా ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్‌కు సంబంధించిన పలు విషయాలను ఆయన పంచుకున్నారు. కొద్ది ఏండ్ల క్రితం డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలను అందిపుచ్చుకున్న తరహాలోనే జనరేటివ్ ఏఐకి కూడా క్లయింట్లు భారీ ఆహ్వానం పలుకుతున్నారని పరేఖ్ వెల్లడించారు.

ఈ కొత్త తరం టెక్నాలజీ ద్వారా వ్యాపారాలకు ఒనగూడే ప్రయోజనాలు వాణిజ్య సంస్థలకు అనుభవంలోకి వచ్చినంతనే జెన్ ఏఐ అడాప్షన్ వృద్ధిచెందుతుందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. తమ భారత, అంతర్జాతీయ సహ సంస్థల్లానే ఇన్ఫోసిస్ ఏఐ ప్లేను పటిష్టపరుస్తున్నట్టు తెలిపారు. తమ క్లయింట్లకు 225 జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రొగ్రామ్‌లపై వర్క్ చేస్తున్నటు, జనరేటివ్ ఏఐ విభాగాల్లో 2,50,000 ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్టు ్ట ఈ ఏడాది ఆరంభంలో ఇన్ఫోసిస్ వెల్లడించింది. 

ఈ టెక్నాలజీని అవలంబించే వ్యాపారాల్లో కూడా జన్ ఏఐ కొత్త విభాగాలను టచ్ చేస్తుందని, ఉదాహరణకు క్రెడిట్  అనాలిసిస్‌ను ఫైన్‌ట్యూన్ చేయడం ద్వారా బ్యాంక్ తన సాధనాల్ని విస్త్రతపర్చుకుని కొత్త ఆదాయ అవకాశాల్ని పొందేందుకు ఉపకరిస్తుందని ఇన్ఫోసిస్ సీఈవో వివరించారు. 

మరిన్ని కంపెనీలను కొంటాం

ఈ ఏడాది ఇప్పటికే రెండు టెక్నాలజీ కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేసిన ఇన్ఫోసిస్ మరిన్ని టేకోవర్లు చేసేందుకు అన్వేషిస్తున్నది. ఈ వివరాల్ని పరేఖ్ వెల్లడిస్తూ డేటా అనలిటిక్స్, సాస్ వంటి విభాగాల్లో ఉన్న కంపెనీల కొనుగోలు పట్ల తాము ఆసక్తిగా ఉన్నామని, వీటికోసం యూఎస్, యూరప్‌ల్లో అన్వేషిస్తున్నామని చెప్పారు. ఇన్ఫోసిస్ ఈ ఏడాది భారత్ కేంద్రంగా పనిచేస్తున్న సెమికండక్టర్ డిజైన్ టెక్నాలజీ కంపెనీ ఇన్‌సెమి టెక్నాలజీ సర్వీసెస్‌లో 100 శాతం ఈక్విటీ వాటాను రూ.280 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

ఏప్రిల్ నెలలో మరో పెద్ద కంపెనీని కొన్నది. జర్మనీకి చెందిన ఇంజినీరింగ్ ఆర్ అండ్ డీ సర్వీసెస్ ప్రొవైడర్ ఇన్‌టెక్ హోల్డింగ్‌లో నూరుశాతం వాటాను 450 మిలియన్ యూరోలకు (రూ.4,045 కోట్లు) కొనడానికి ఒప్పందంపై సంతకాలు చేసింది. తాము ఇప్పటికే ఒకటి సెమికండక్టర్, మరోటి ఆటోమొటివ్ విభాగాల్లో రెండు మంచి ఇంజినీరింగ్ కంపెనీలను కొని, ఆ దిశగా విస్తరిస్తున్నామని పరేఖ్ చెప్పారు. తమ బ్యాలెన్స్ షీట్, నగదు ఫ్లో బాగున్నందున, వివిధ విభాగాల్లో కొనుగోళ్లకు చూస్తున్నామన్నారు. 

రిక్రూట్‌మెంట్లు పెంచుతాం

జన్ ఏఐ వ్యాపారాలు మరింత వృద్ధిచెందేందుకు తోడ్పడుతుందని తాను భావిస్తున్నారని, ఈ నవతరం టెక్నాలజీతో తమ కంపెనీలో ఎటువంటి ఉద్యోగాల కోతలు ఉండబోవని పరేఖ్ పదేపదే స్పష్టం చేశారు. వాస్తవానికి ఆర్థిక వాతావరణం మారినంతనే తాము రిక్రూట్ మెంట్లు పెంచుతామని వెల్లడించారు. ఈ క్యూ1లో పటిష్ఠమైన వృద్ధి సాధించామని, ఎక్కువ సంఖ్యలో పెద్ద డీల్స్ సంపాదించామని, దీంతో తమ గైడెన్స్‌ను కూడా పెంచినట్టు గుర్తుచేశారు. ‘అందుచేత వృద్ధి మళ్లీ నెమ్మదిగా పుంజుకున్నట్టు చూస్తు న్నాం’ అని పరేఖ్ చెప్పారు.

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నుంచి కస్టమర్ సర్వీ సుల వరకూ వివిధ విభాగాల్లో వ్యాపార ప్రయోజనం కల్పించే మార్గాలను క్లయింట్లు అన్వేషిస్తున్నందున, జన్ ఏఐ చాలా కీలకంగా మారిందన్నారు. బ్యాంక్ క్రెడిట్ డిపార్ట్‌మెంట్‌లో, తయారీ కంపెనీ ప్రొడక్ట్ ఎలిమెంట్‌లో, టెలికాం కంపెనీ ప్రైసింగ్ విధానంలో..ఇలా  ఏ వ్యాపారంలోనైనా జనరేటివ్ ఏఐ చాలా ఉపకరిస్తుందని వివరించారు.

డెలాయిట్ తాజా నివేదిక ప్రకారం జన్ ఏఐ మార్కెట్ 2023 నుంచి 2030 వరకూ చక్రగతిన 24.4 శాతం వార్షిక వృద్ధి సాధిస్తుందని అంచనా. అలా గే ఏఐ ఇన్పోవేషన్‌లో ఇండియా గ్లోబల్ లీడర్‌గా ఆవిర్భవిస్తుందని డెలాయిట్ అం చనా వేసింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ టొపా జ్ ద్వారా క్లయింట్లకు ఏఐ, జనరేటివ్ ఏఐ క్లయింట్లకు అందుబాటులో ఉంచింది.