కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి సమర్పించిన పూర్తిస్థాయి బడ్జెట్ కొంత మోదం, మరికొంత ఖేదాన్ని మిగిల్చింది. కొత్త ప్రభుత్వం సమర్పించబోయే ఈ బడ్జెట్‌పై దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కార్మిక, కర్షక అనుకూల విధానాలు ఉంటాయని, కొత్త సంక్షేమ పథకాలను ప్రకటిస్తారని, అభివృద్ధి ఉరకలు వేయడానికి, రోజురోజుకు పెరిగి పోతున్న నిరుద్యోగ సమస్యను కొంతమేరకైనా తగ్గించడం ద్వారా లక్షలాది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రోది చేసే విధంగా బడ్జెట్ ఉంటుందని భావించారు. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలమ్మ బలమైన అడుగులే వేశారు. రూ.48.21 లక్షలకోట్ల భారీవ్యయంతో రూపొందించిన బడ్జెట్‌లో నవప్రాధాన్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించడం ద్వారా ‘వికసిత్ భారత్’ను సాధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ దిశగా దేశం లో అత్యధికంగా ఉపాధిని కల్పిస్తున్న, దేశ జీడీపీకి జీవగర్ర అయిన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే కొత్త పథకాలకు అంకు రార్పణ చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా రాబోయే రెండేళ్లలో కోటిమంది రైతులను ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించేందుకు చర్యలను బడ్జెట్‌లో ప్రకటించారు. పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తామని కూడా ఆర్థికమంత్రి ప్రకటించారు. కూరగాయల ఉత్పత్తి, రొయ్యల సాగుకు ప్రోత్సాహాలనుకూడా ప్రకటించారు. వీటితోపాటు గ్రామీణాభివృద్ధి, రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు.
అన్నిటికన్నా మించి ఇప్పటికే చదువులు పూర్తి చేసుకుని తగిన ఉద్యోగాలు లభించక నిరుత్సాహంలో కూరుకుపోతున్న యువతకు ఉపాధి కల్పనకోసం బడ్జెట్‌లో అనేక చర్యలను ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రధానంగా యువతలో నైపుణ్యాభివృద్ధిపై దృప్టిపెట్టిన మంత్రి ఈ దిశగా పలు చర్యలు ప్రకటించారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు ఉపాధి కల్పించే పరిశ్రమలకు , కొత్తగా ఉపాధి పొందిన యువతకు సైతం ప్రోత్సాహకాలను ప్రకటించారు. అయితే, వ్యక్తిగత పన్ను శ్లాబుల్లో మార్పులు చేసి ఊరట కల్పి స్తారని ఆశించిన మధ్యతరగతి వేతనజీవులకు మాత్రం నిరాశే మిగిలింది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. మధ్యంతర బడ్జెట్ తరహాలోనూ పూర్తి స్థాయి బడ్జెట్‌లోనూ గృహ నిర్మాణం, విద్యుత్, రహదారులు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. జనాకర్షక పథకాల జోలికి వెళ్లకుం డా అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పన్నుల భారం లేకుండా ఉపాధి కల్పనకు పెద్దపీట వేయడంపై సామాన్య ప్రజలు సంతోషిస్తున్నారు.
ఎంతో తెలివిగా ఎవరినీ నొప్పించని రీతిలో బడ్జెట్‌ను రూపొందించిన నిర్మలమ్మ మిత్రధర్మాన్ని సైతం మరువలేదు. సంకీర్ణ ప్రభుత్వానికి అండ గా నిలిచిన నితీశ్ కుమార్, చంద్రబాబుల డిమాండ్లను పూర్తిగా కాకపోయినా చాలావరకు తీర్చే విధంగా బీహార్, ఆంధ్రప్రదేశ్‌లకు భారీగానే నిధులను కేటాయించారు. ఏపీ ప్రధాన డిమాండ్లయిన పోలవరం ప్రాజె క్టు, రాజధాని అమరావతి నిర్మాణాలకు ఉదారంగా నిధులను ప్రకటించడమేకాక బీహార్‌కూ భారీ వరాలు కురిపించారు. దీనిపై ఎన్డీయేతర పార్టీ లు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అసంతృప్తిని వ్యక్తం చేయడం న్యాయమే. అయితే, త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హర్యానాలాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలకుసైతం తాయిలాలు ప్రకటించక పోవడం చూశాక నిర్మలమ్మ ఈ విషయంలో సమన్యాయం పాటించారనే భావించాలి.