ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
గజ్వేల్, జూలై 5: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికకు 1:100 నిష్పత్తి పాటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులకు స్కూటీ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. సమావేశంలో నాయకులు పంగ మల్లేశం, మాదాసు శ్రీనివాస్, బెండ మధు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.