10-12-2024 02:01:39 AM
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తింపు ఇచ్చింది. సంప్రదాయ స్త్రీమూర్తిగా, ప్రశాంత వదనంతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో ఉన్న విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలుగులో ఉత్తర్వులు జారీచేశారు.
ఇకపై ఏటా డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను బహిరంగ, ఇతర ప్రదేశాల్లో, సామాజిక మాధ్యమాల్లో మాటలు లేదా చేతలతో ఆగౌరవపర్చడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపర్చడం నేరంగా పరిరగణిస్తామని జీవోలో ప్రభుత్వం హెచ్చరించింది.