calender_icon.png 22 September, 2024 | 4:53 AM

ప్రజా సమస్యలే ఎజెండాగా పోరాడిన జిట్టా

16-09-2024 04:16:47 AM

  1. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
  2. భువనగిరిలో సంతాప సభకు హాజరు
  3. నివాళులర్పించిన కేటీఆర్, పలువురు నేతలు

యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు 15 (విజయక్రాంతి): పదవులు లేకున్నా, ప్రజా సమస్యలే ఎజెండాగా పోరాటాలు చేసిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రజల మనిషి అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన జిట్టా బాలకృష్ణారెడ్డి సంతాప సభకు ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. జిట్టా మరణం తెలంగాణ ప్రజలకు తీరనిదన్నారు. సొంత డబ్బుతో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి అని అన్నారు. 

కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతల నివాళులు..

జిట్టా బాలకృష్ణారెడ్డి సంతాప సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. జిట్టా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్వర్ రెడ్డి, వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎం కోటిరెడ్డి, ఎమ్మెల్యే లు వివేకానంద గౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఉన్నారు.

జిట్టా విగ్రహం ఏర్పాటు చేస్తాం..

జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహాన్ని భువనగిరి ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసి ఆయన సేవలను స్మరించుకుంటామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం జిట్టా సంతాప సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రకటన చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.