calender_icon.png 27 December, 2024 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ ప్రమాణం

01-08-2024 01:00:58 AM

ప్రమాణం చేయించిన సీజే అరాధే 

తెలంగాణ సంపదకు నిలయం

భిన్న సంస్కృతులకు ఆలవాలం 

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసలు

హైదరాబాద్, జూలై ౩౧ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర నాలుగో గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో జిష్ణుదేవ్ చేత హైకోర్టు సీజే అలోక్ ఆరాధే గవర్నర్‌గా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాం క్షలు తెలిపారు. అంతకుముందు హైదరాబాద్‌కు వచ్చిన గవర్నర్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 

భిన్న సంస్కృతుల కేంద్రం తెలంగాణ: గవర్నర్

రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ చేయడం సంతోషించదగ్గ విషయమని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మనది వ్యవసాయ ఆధారిత దేశమని, ఆర్థిక వ్యవస్థకు వ్యవ సాయమే వెన్నుముక అని అన్నారు. తెలంగాణ ప్రాంతం విభిన్న సంస్కృతులకు, గొప్ప చరిత్రకు నిలయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సహజ వనరులు, సారవంతమైన వ్యవసాయ భూమి ఉందని, ఈ రాష్ట్రం వాణిజ్యానికి మంచి కేంద్రమని పేర్కొన్నారు. రాష్ట్రానికి యువ, డైనమిక్ ముఖ్యమంత్రితోపాటు సమర్థవంతమైన మంత్రివర్గం ఉందని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన వెల్లడించారు.

యువత మన దేశ సంపద అని.. విద్యా, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు. విద్యతోపాటు, ప్రజలకు నాణ్యమై వైద్యాన్ని అందించాల్సి ఉంటుందని అన్నారు. అసమాన తలను తొలగించేలా కలిసి పనిచేయాలని, అందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, దామోదర రాజనర్సింహ, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.