calender_icon.png 15 November, 2024 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఏడాది జియో ఐపీవో?

05-11-2024 12:00:00 AM

రిటైల్ పబ్లిక్ ఇష్యూ  మరింత ఆలస్యం!

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం విభాగం జియో వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 100 బిలియన్ డాలర్ల విలువతో మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇండస్రీస్‌కు చెందిన రిటైల్ విభాగం ఐపీఓకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ’రాయిటర్స్’ తన కథనంలో పేర్కొంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో, రిటైల్ విభాగాలను ఐపీఓకు తీసుకురానున్నట్లు ముకేశ్ అంబానీ 2019లోనే ప్రకటించారు. ఈ తర్వాత దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇటీవల కాలంలో కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, అబుదాభి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ నుంచి డిజిటల్, టెలికాం, రిటైల్ వ్యాపారాల కోసం 100 బిలియన్ డాలర్ల విలువ వద్ద 25 బిలియన్ డాలర్లను రిలయన్స్ సమీకరించింది.

ఈ క్రమంలో వచ్చే ఏడాది జియోను ఐపీఓకు తీసుకొచ్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థిరమైన వ్యాపారం, ఆదాయంతో 47 కోట్ల మంది చందాదారులతో పెద్ద టెలికాం కంపెనీగా జియో కొనసాగుతుండడంతో దీన్ని తొలుత ఐపీఓకు తీసుకురావాలని రిలయన్స్ యోచిస్తోంది. రిటైల్ వ్యాపారంలో మాత్రం ఇప్పట్లో ఐపీఓకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.

ఈ విభాగంలో కొన్ని అంతర్గత సమస్యలను, నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు జాప్యానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై రిలయన్స్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ జియో వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు వస్తే.. అతిపెద్ద ఐపీఓ అయ్యే అవకాశం ఉంది. ఐపీఓ టైమ్‌లైన్ మారే అవకాశమూ లేకపోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.