calender_icon.png 28 October, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్ చార్జీలు పెంచిన జియో

28-06-2024 01:05:54 AM

  • 12 శాతం మేర పెరుగుదల

న్యూఢిల్లీ, జూన్ 27: దేశంలో పెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో మొబైల్ సర్వీసు చార్జీలను పెంచింది. జూలై 3 నుంచి తమ చార్జీలు 12 శాతం మేర పెరుగుతాయని గురువారం కంపెనీ తెలిపింది. దాదాపు అన్ని ప్లాన్ల ధరల్ని జియో పెంచింది. కనిష్ఠ రీచార్జ్ టాప్‌అప్ (1జీబీ యాడ్ ఆన్ ప్యాక్) ధరను 27 శాతం పెంచింది. దీంతో టాప్‌అప్ ధర రూ.15 నుంచి రూ. 19కు చేరుతుంది. 15జీబీ పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్ ధరను రూ. 399 నుంచి రూ. 449కు చేర్చింది. ప్రాచుర్యం పొందిన 84 రోజుల వ్యాలిడిటీగల రూ.666 అన్‌లిమిటెడ్ ప్లాన్ ధర 20 శాతం పెరిగి రూ. 799కు చేరుతుంది. రూ.1,559 ధరగల సంవత్సరపు రీచార్జ్ ప్లాన్‌ను రూ. 1,899కి, రూ. 2,999 ప్లాన్ ధరను రూ. 3,599కి పెంచింది. 

2 జీబీ దాటితేనే ఆపరిమిత 5జీ డేటా  

రోజుకు 2 జీబీ, ఆపై ప్లాన్‌లు అన్నింటిలో అపరిమిత 5జీ డేటాను అందిస్తామని, కొత్త ప్లాన్‌లు 2024 జూలై 3 నుంచి వర్తిస్తాయని జియో తెలిపింది. ప్రస్తుతం రూ.239 ప్లాన్లపైన అన్నింటికీ అపరిమిత ఉచిత 5జీ డాటా అందిస్తుండగా, మిగిలిన ఖాతాదారులు అపరిమిత 5జీ సేవల కోసం రూ.61 వోచర్‌తో టాప్‌అప్ చేసుకోవాల్సి ఉన్నది. దీంతో రోజుకు 2జీబీ లభ్యతలేని ప్లాన్లు కలిగినవారు 5జీ సర్వీసులు కావాలంటే వారి ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి లేదా టాప్‌అప్ చేసుకోవాలి.