లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. ఆర్‌కే ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా వ్యవహరిస్తూ, ఈ నెల 29న తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఎం రత్నం మాట్లాడుతూ.. “నా ‘కర్తవ్యం’ మూవీ చూసి చాలామంది అమ్మాయిలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించారు. అలా సినిమా మాధ్యమం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ‘ఝాన్సీ ఐపీఎస్’తో రామకృష్ణ గౌడ్‌కు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా” అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ.. “ఝాన్సీ ఐపీఎస్’ స్ఫూర్తిని నింపుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
చిత్ర నిర్మాత ఆర్‌కే గౌడ్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో భూ కబ్జాలు చేసి బిల్డింగ్స్ కట్టిన వారి భవనాలు కూల్చే ఐపీఎస్ ఆఫీసర్‌గా లక్ష్మీరాయ్ కనిపిస్తారు. దాంతో ఇప్పటి హైడ్రా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత ‘మహిళా కబడ్డీ జట్టు’ అనే మూవీ చేస్తున్నాం. ఢీ విన్నర్ అక్సాఖాన్ ఆ సినిమాలో నటిస్తారు” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీ మా ప్రెసిడెంట్ రశ్మి ఠాకూర్, నటి అక్సాఖాన్, నిర్మాత ఏ గురురాజ్, స్నిగ్ధరెడ్డి, మౌనికరెడ్డి, రవి, అల్లభక్షు, డీఎస్‌రెడ్డి, దుబాయ్ ప్రసాద్, కిషోర్ తేజ, కొఠారి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.