కొచ్చి: మలయాళ నటి హనీరోజ్(Malayalam actress Honey Rose) దాఖలు చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుంది. 24 గంటలలోపే కొచ్చి సిటీ పోలీసులు బోచే అని పిలువబడే వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వయనాడ్(Wayanad)లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నటి చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి బుధవారం తెలిపారు. సోషల్ మీడియా(Social media)లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెమ్మనూర్ తనపై లైంగిక ఆరోపణలు చేశారని ఫిర్యాదులో వాపోయారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేధింపులకు గురయ్యానని నటి హనీరోజ్ ఫిర్యాదు చేయడంతో 30 మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.
చెమ్మనూర్‌పై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 75, (లైంగిక వేధింపులు), ఐటీ చట్టంలోని సెక్షన్ 67 (ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్యకరమైన విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం) కింద కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్(Facebook post)లో, తనపై చెమ్మనూర్ నిరంతరం అవమానకరమైన వ్యాఖ్యలపై తాను ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసానని చెప్పిన ఆమె భారతీయ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయొద్దని ఇతరులను కూడా హనీరోజ్(Honey Rose) హెచ్చరించారు. అయితే, ఆమె ఆరోపణలను చెమ్మనూర్ ఖండించారు. తాను ఎటువంటి అవమానకరమైన పదాలను ఉపయోగించలేదని పేర్కొన్నారు. "ఆమె నా రెండు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యింది. మేము డ్యాన్స్ చేశాం.. నేను జోకులు చెప్పేవాడిని, ఆ విషయాలతో ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదనిపించింది. నెలల తర్వాత ఇప్పుడు ఆమె నాపై ఫిర్యాదు చేసింది" అని వ్యాపారవేత్త చెప్పారు.