- తాజ్‌మహల్ హోటల్‌లో వినియోగదారుడికి చేదు అనుభవం
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు
- చివరకు నోటీసు ఇస్తామని చేతులు దులుపుకొన్నారు !
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఆకలితో హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. తనకిష్టమైన పప్పు ఆర్డర్ చేసి.. తీరా టేబుల్ పైకి వచ్చాక చూసేసరికి గిన్నెలో జెర్రీ కనిపించింది. దీంతో అతడు కంపరానికి గురై.. తేరుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఘటన వెలుగు చూసింది ఒక చిన్నాచితక హోటల్ కాదు..
సిటీ నడిబొడ్డున ఉన్న ఓ ప్రముఖ హోటల్‌లో చోటుచేసుకున్నది. వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం అబిడ్స్ తాజ్‌మహల్‌కు వెళ్లాడు. మెనూలో తనకిష్టమున్న ఆహార పదార్థాలతో పాటు పప్పు కూడా ఆర్డర్ చేశాడు. పప్పు గిన్నె టేబుల్‌పైకి వచ్చాక.. తీరా ప్లేట్లో వేసుకుందామనుకునే లోపు గిన్నెలో జెర్రీ కనిపించింది.
దీంతో వినియోగదారుడు హోటల్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. అయినా వారి నుంచి సరైన స్పందన లేదు. దీంతో వినియోగదారుడు అబిడ్స్‌లోని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు మధ్యాహ్నం 2.40 గంటలకు ఫిర్యాదు చేయగా సాయంత్రమైనా అధికారులు స్పందించలేదు.
దీంతో బాధితుడు ఉసూరుమంటూ వెనుదిరిగాడు. దీనిపై అబిడ్స్ గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సూర్యను వివరణ కోరగా.. తాము హోటల్ తనిఖీ చేయలేకపోయామని, బాధితుడి ఫిర్యాదు మేరకు సదరు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తామని సమాధానమిచ్చారు.
ఇదే విషయంపై అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మూర్తిరాజును సంప్రదించగా, తమశాఖకు ఫిర్యాదు అందగానే తనిఖీ చేయాల్సి ఉందని సమాధానమిచ్చారు. కానీ, ఆ శాఖ అధికారులు ఎందుకు తనిఖీ చేయలేదో తనకు తెలియదని చెప్పారు.