- హోటల్‌ను సీజ్ చేసిన అధికారులు
- జగిత్యాలలో ఘటన
జగిత్యాల, అక్టోబర్ 13 (విజయక్రాంతి): జిల్లా కేంద్రమైన జగిత్యాల తహసిల్ చౌరస్తాలోని ఉడిపి హోటల్‌లో ఇడ్లీలో జెర్రీ రావడంతో హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. ఆదివారం ఉదయం ఓ మహిళ తన కుటుంబంతో కలిసి గణేష్ భవన్ ఉడిపి హోటల్‌కు వెళ్లి ఇడ్లీ ఆర్డర్ చేసింది.
తన పిల్లలకు ఆహారం అందించే ప్రయత్నంలో ఇడ్లీలో జెర్రీ కనిపించింది. షాక్‌కు గురైన ఆమె హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటల్ ఎదుట కుటుంబంతో కలిసి బైఠాయించింది. మొదట జెర్రీ కాదని, అది కేవలం నల్ల దారం అని చెప్పిన యజమాని, తన మాటలకు కట్టుబడి ఉండలేక ఇడ్లీని నోట్లో వేసుకోవడాని కూడా ప్రయత్నించాడు.
జెర్రీ అని నిర్ధారించుకున్న తర్వాత హోటల్ యజమాని ఆ ఇడ్లీని ఉమ్మివేశాడు. అప్పటికే గుమికూడిన ప్రజలు యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్ యాజమాన్యం ఇడ్లీలను మున్సిపల్ ట్రాక్టర్ దారా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బాధితురాలు ఇతర ప్రజలు అడ్డుకున్నారు.
ఇడ్లీలను రోడ్డు మీదే పారవేసి, ప్రజారోగ్య పరి రక్షణకు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ ఫిర్యాదుతో హోటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు.