మువాన్ : దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయం(Muan International Airport)లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కనీసం 179 మంది మరణించారని అగ్నిమాపక సిబ్బందిని ఉటంకిస్తూ వార్తా సంస్థ యోన్‌హాప్ నివేదించింది. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఇద్దరిని మాత్రమే రక్షించారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరూ ప్రస్తుతం సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్యాంకాక్ నుంచి ముయాన్(Bangkok to Muang) వస్తున్న జెజు ఎయిర్ విమానం(Jeju Air plane)లో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.03 గంటలకు అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో కూలిపోయింది. ల్యాండింగ్ గేర్ వైఫల్యాన్ని ఎదుర్కొన్న బోయింగ్ 737-800, మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెల్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. ఎయిర్‌పోర్ట్ దిగుతుండగా గోడను ఢీకొట్టింది. గోడను ఢీకొన్న తర్వాత విమానం పేలిపోవడంతో భారీగా మంటలంటుకున్నాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక, రక్షణ సిబ్బంది మంటలను అదుపుచేసి ఈ ప్రమాదంలో మరణించిన మృతదేహాలను వెలికి తీయడంపై అధికారులు దృష్టి సారించారు.