18-04-2025 11:49:49 AM
హైదరాబాద్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (Joint Entrance Examination) మెయిన్ 2025 సెషన్- 2 ఫలితాలను ఏప్రిల్ 19 నాటికి ప్రకటిస్తుంది. ఫలితాలను ప్రకటించే ముందు, తుది కీ ఏప్రిల్ 18న విడుదల చేయబడుతుంది. జేఈఈ మెయిన్ 2025 సెషన్-2 ఫైనల్ కీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు జేఈఈ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ శుక్రవారం ఎక్స్ లో పోస్ట్ చేసింది. జేఈఈ మెయిన్స్ సెషన్-2 ఫలితాలపై ఎన్టీఏ నేడు స్పందించింది.
గురువారం జేఈఈ మెయిన్స్ సెషన్-2(JEE Mains Session-2) ఫైనల్ కీని ఎన్టీఏ ప్రకటించింది. విడుదల చేసిన కాసేపటికే వెబ్ సైట్ నుంచి ఫైనల్ కీని తొలగించింది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-2 ప్రిలిమినరీ ఆన్సర్ కీలలో తొమ్మిది తప్పులు ఉన్నాయని ముందుగా అభ్యర్థులు, నిపుణులు గుర్తించారు. కోటా విద్యార్థులు తెలిపిన ప్రకారం, ఏప్రిల్ 11న విడుదలైన ఆన్సర్ కీలలో భౌతిక శాస్త్రంలో నాలుగు, రసాయన శాస్త్రంలో మూడు, గణితంలో రెండు లోపాలు ఉన్నాయి. వారు ఆ లోపాలను పూర్తిగా వాస్తవ లోపాలుగా అభివర్ణించారు. ఈ ప్రశ్నలను ప్రవేశ పరీక్ష నుండి తొలగించాలని సూచించారు. ఎన్టీఏ జేఈఈ మెయిన్ సెషన్- 2 ఫలితాల కోసం యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీని ఉపయోగించాల్సి ఉంటుంది.