calender_icon.png 22 January, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి జేఈఈ మెయిన్

22-01-2025 01:05:03 AM

తెలుగు రాష్ట్రాల నుంచి 1.50 లక్షల మంది అభ్యర్థులు

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదా పు 1.50 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. 22, 23, 24, 28, 29 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు జరగనున్నాయి. దేశంలోని ఎన్‌ఐ టీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్షను నిర్వహిస్తారు.

చివరి రోజు 30న బీఆర్క్, బీప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పేపర్లకు కలిపి దాదాపు 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్ సెషన్- 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న అడ్వాన్స్‌డ్ పరీక్ష రాస్తారు.