calender_icon.png 20 April, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్ ఫైనల్ కీ మళ్లీ విడుదల

19-04-2025 12:00:00 AM

  1. నేడు ఫలితాలు 
  2. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెషన్-2 తుది కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మళ్లీ విడుదల చేసింది. ముందుగా గురువారం ఫైనల్ కీని విడుదల చేయగా, గంటల వ్యవధిలోనే ఆ కీని తొలగించి తాజాగా మరో కీని విడుదల చేయడం గమనార్హం. తుది కీని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఈమేరకు ఎన్టీఏ ఎక్స్ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అంతేగాక ఫలితాలను ఈ నెల 19 (శనివారం) వరకు ఎప్పుడైనా ప్రకటిస్తామని పేర్కొంది. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫైనల్ కీని డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులను సూచించింది.

తుది కీలో ఫిజిక్స్‌కు సంబంధించి రెండు ప్రశ్నలను తొలగించినట్టు తెలిపింది. గురువారం సాయంత్రం ఫైనల్ కీ విడుదల చేసి, గంటల్లోనే తొలగించడంపై ఎన్టీఏ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

ఇదిలా ఉంటే పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం ఈనెల 17 నాటికి ఫలితాలను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఫలితాలను ఇవ్వకపోవడంతో ఎన్టీఏ విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్టీఏ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.