01-05-2024 01:35:00 AM
కీచక ఎంపీని బహిష్కరించిన జేడీఎస్
అశ్లీల వీడియోల వ్యవహారంలో ప్రజ్వల్‌పై చర్యలు
బెంగళూరు, ఏప్రిల్ 30: సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లైంగిక వేధింపులు, అశ్లీల వీడియోల వ్యవహారంలో జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డ హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్నను పార్టీ నుంచి బహిష్కరించింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ మంత్రి రేవణ్న కుమారుడు ప్రజ్వల్ మహిళలపై లైంగిక దాడికి పాల్పడుతున్న వేల అశ్లీల వీడియోలు వైరల్ కావడంతో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రజ్వల్‌కు సోదరి వరుస అయిన ఓ మహిళ ఫిర్యాదుతో అతడి ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. తనపై ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి రేవణ్న కూడా లైంగిక దాడికి పాల్పడేవారని తీవ్ర ఆరోపణలు చేసింది. తన కూతురితో వీడియో కాల్స్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడని కూడా తెలిపింది. దీంతో ప్రజ్వల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలు ఏప్రిల్ 26న రెండో విడత ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సిఫారసు చేసింది. ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.