23-04-2025 08:55:44 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపిన జేడీ వాన్స్ ఈ కష్ట సమయంలో భారత దేశ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశాన్ని సందర్శిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడి ఈ దారుణమైన చర్యపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం... ప్రస్తుతం ఆగ్రాలో ఉన్న వాన్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడిన వాన్స్ పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటంలో సహకారానికి అమెరికా సిద్ధంగా ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన మాట్లాడినట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ ఇద్దరూ అందించిన మద్దతు, సంఘీభావ సందేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారని విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదించింది.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీని ఫోన్ ద్వారా సంప్రదించి, పహల్గామ్ దాడిపై సంతాపం తెలియజేశారు. ఈ దాడిలో అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న సంఘటనగా ఖండిస్తూ, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయడానికి అమెరికా భారతదేశానికి పూర్తి మద్దతు ఇస్తుందని ట్రంప్ చెప్పారు. ఈ పిరికి చర్యకు కారణమైన వ్యక్తులు, శక్తులను కఠినంగా శిక్షించాలని భారతదేశం నిశ్చయించుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ లో పోస్టు చేశారు.