calender_icon.png 19 April, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్‌పర్సన్‌గా జయసుధ

17-04-2025 12:00:00 AM

15 మందితో కమిటీ ఏర్పాటు 

మొత్త 1,248 నామినేషన్లు దాఖలు 

వ్యక్తిగత క్యాటగిరిలో 1,172 అర్జీలు 

చలనచిత్రాలు, డాక్యుమెంటరీ, పుస్తకాలు తదితరాలకు 76 

ఈ నెల 21 నుంచి స్క్రీనింగ్ చేయనున్న జ్యూరీ సభ్యులు 

చైర్‌పర్సన్ అధ్యక్షతన జ్యూరీ కమిటీ సమావేశం 

జ్యూరీకి ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు  సలహాలు, సూచనలు 

తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ చైర్‌పర్సన్‌గా నటి జయసుధను ఎంపిక చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది.

జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యూరీ కమిటీకి పలు సలహాలు సూచనలు చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 14 ఏండ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డ్స్‌ను ఇస్తున్నట్టు చెప్పారు.

ఇందుకోసం ఏర్పాటుచేసిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలనచిత్ర అవార్డ్స్‌కు ఇంత స్పందన రాలేదన్నారు. అవార్డ్స్‌కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులను కోరారు.

తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా వ్యవహరించాలని సూచినంచారు. జయసుధ మాట్లాడుతూ.. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్‌గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ హరీశ్ మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ అన్ని క్యాటగిరీలకు కలిపి 1,248 నామినేషన్లు అందాయని చెప్పారు.

వ్యక్తిగత క్యాటగిరిలో 1172, ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ/లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర క్యాటగిరీల్లో 76 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు. ఈ నెల 21 నుంచి నామినే షన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని జ్యూరీ తెలిపింది.