calender_icon.png 18 November, 2024 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్తనశాస్త్ర మహాగ్రంథకర్త జాయప సేనాని

29-07-2024 12:00:00 AM

గన్నమరాజు గిరిజా మనోహరబాబు :

వేదాలతో సమానమైన గౌరవాన్ని నాట్యానికి కల్పించిన సనాతన భారతీయులు దానిని ‘నాట్యవేదం’గానే భావించి ఆదరించారు. సాహిత్యానికి, సంగీతానికి, నృత్యానికీ చోటిచ్చే ఈ శాస్త్రం ఒక ‘త్రిపుటి’. దీనికి ఆధారమైన శాస్త్రగ్రంథాలు సంస్కృతంలో మహామహుల రచనలుగా వెలువడ్డాయి. వాటిలో ఎన్నె న్నో విశేషాంశాలను వారు పొందుపరిచారు. ‘వేదత్రయి’గా పిలిచే ఋగ్వేదం నుండి ‘పాఠ్యాన్ని’, యజుర్వేదం నుండి ‘అభినయాన్ని’, సామవేదం నుంచి ‘సంగీతాన్ని’ సమాహారంగా గ్రహించి రూపొందించిన శాస్త్రమే ‘నాట్యశాస్త్రం’ అని భారతీయ గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి. నాట్యశాస్త్ర గ్రంథకర్తల్లో ప్రప్రథముడు భరతముని. ఆయన నాట్యశాస్త్రం తర్వాతే నందికేశ్వరుని ‘అభినయ దర్పణం’, అదే మార్గంలో వెలువడ్డ అభినవ గుప్తుని ‘అభినవ భారతి’, ఈ కోవలో జాయప సేనాని రచించిన ‘నృత్త రత్నావళి’ వంటి గ్రంథాలను అతి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.

బాల వీరుడు

తెలుగునేలపై కాకతీయరాజ్య వైభవాల వెలుగులను దశదిశలా వ్యాపింప చేసిన ప్రభువులలో గణపతిదేవ చక్రవర్తి ముఖ్యులు. ఒకవైపు యుద్ధాలలో మునిగి తేలుతూనే మరోవైపు కళలను, సాహిత్యాన్ని కూడా సమాదరించగలిగిన మహాప్రభువు ఆయన. తిక్కన మహాకవిని ఎంతో గొప్పగా గౌరవించడమేకాక ఆ మహనీయుని కోరికపై మనుమసిద్ధి మహారాజు శత్రువులను పారద్రోలి, తిరిగి మనుమసిద్ధిని సింహాసనస్థుని చేసిన మహావీరుడాయన. వారి దండయాత్రల్లో భాగంగా వెలనాడు ప్రాంతంలో క్రొయ్యూరు కేంద్రంగా పాలన చేస్తున్న నారాయణ నాయకుని, అతని కుమారుడు పిన్నచోడ నాయకులనూ జయించాడు.

తర్వాత వారితో సంధి చేసుకొని నారా యణ నాయకుని పుత్రికలైన నారమ, పేరమలను వివాహమాడి, వారిని తన రాజ్యానికి తీసుకొని వచ్చాడు. ఈ సందర్భంలోనే నారాయణ నాయకుని మనుమడు, పిన్నచోడ నాయకుని పుత్రుడు అయిన ‘జాయప’నుకూడా తన వెంట గొని వచ్చా డు. బాలుడైన ‘జాయప’లోని వీరుణ్ణి గుర్తించి ఆయనకు వీరోచిత విద్యలు నేర్పించి తన సైన్యానికి సేనాధిపతిగా నియమించాడు. వీరాధివీరుడైన జాయప అనేక యుద్ధాలలో గణపతి దేవుని పక్షాన పోరాటాలు చేసి కాకతీయ ప్రాభవాన్ని మరింత ఇనుమడింప చేశాడు.

మహోన్నత నాట్యశాస్త్ర గ్రంథం

‘జాయప’, ‘జాయన’, ‘జాయసేనాని’ ఇలా పలు పేర్లతో ప్రసిద్ధినొందిన ఈ వీరుని రెండో పార్శం ‘నాట్యశాస్త్ర అభినివేశం’. ఆయన గుండయామాత్యుని శిక్షణలో నాట్య కళాభ్యాసం చేసి తన అభిరుచికి మెరుగులు దిద్దుకొన్నాడు. స్వ యంగా తానే ఒక ప్రామాణికమైన గొప్ప నాట్యశాస్త్ర గ్రంథం రాశాడు. అదే ‘నృత్త రత్నావళి’. తెలుగునేలపై పుట్టి అద్భుతంగా, ప్రజానురంజకమైన పాలనను అందించిన ప్రభువులేకాక వారి సేనాధిపతులు, మంత్రులు మొదలైన ప్రముఖులు కూడా ఇలా రచనా రంగంలో రాణించడం విశేషమే. పైగా, ఎంతో విలువైన శాస్త్రగ్రంథాలనూ వారు వెలయించారు. అటువంటి ప్రముఖులలోని ఒకరే ఈ జాయప సేనాని. ఈయన కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుని కొలువులో సేనా ధిపతిగా బాధ్యతలు నిర్వహించేవాడు. మరోవైపు, అనితర సాధ్యమైన, విశేష రచనగా కీర్తి పొందిన ‘నృత్త రత్నావళి’ని రచించారు. ‘నర్తనశాస్త్ర మహాగ్రంథకర్త’గా జాయప సేనాని చరిత్రలో నిలిచిపోయారు. 

ఒక ప్రత్యేకమైన విషయాన్ని గ్రహించి దానికి సంబంధించిన పూర్వగ్రంథాలను అవలోకించి, తనదైన ఒక నూతన నృత్యశాస్త్ర గ్రంథాన్నే సృజియించిన సారస్వత ఘనుడు ఈ సేనాని. ఆయన విధి నిర్వహణకు, ఈ రచనా రంగానికి ఏ మాత్ర మూ పొంతన లేకున్నా తనలోని అభిరుచియే ఆయనను ఈ మార్గంలోకి నడిపించింది. ఒకవైపు రాజకీయ సంబంధమైన యుద్ధపు ఒత్తిళ్లలో తలమునకలు అవుతూనే, మరోవైపు ఈ నృత్య సంబంధ గ్రంథాల ఆంతర్యాల్ని అధ్యయనం చేశా డు. నిజానికి ఇదంత సులువైన విషయమూ కాదు. అందుకే, ‘నృత్త రత్నావళి’ నేటికీ ఒక మహోన్నత శాస్త్రగ్రంథంగా ఉపయోగపడుతున్నది. ఇం దులోని సూత్రీకరణలు, వ్యక్తీకరణలు జాయప సేనానిలోని నాట్యశాస్త్ర ప్రతిభకు అద్దం పడుతున్నాయి.

నృత్యానికి, నృత్తానికి మధ్య..

జాయప సేనాని రచన ‘నృత్త రత్నావళి’ నాట్యశాస్త్రంలో ప్రత్యేకంగా పేర్కొన్న ‘నృత్తము’ అనే ప్రక్రియ విశేషాలను ఈ గ్రంథంలో చూస్తాం. సాధారణంగా ‘నాట్యం’ అనగానే ‘నృత్యం’ అనే అనుకుంటాం. కానీ, ‘నాట్యం’, ‘నృత్యం’, ‘నృత్తం’ మూడూ వేర్వేరు ప్రక్రియలు. 

ఈ విషయాన్ని నందికేశ్వరుడే 

తన ‘అభినయ దర్పణం’లో

‘నాట్యం తన్నాటకం చైవ పూజ్యం 

పూర్వ కథాయుతమ్

భావాభి నయహీనం తన్నృత్త మభిధీయతే

రసభావ వ్యంజనాది యుక్తనృత్య మితీర్యతే’

అన్నాడు. అంటే, ‘నాట్య’మనేది నాటకంలో పూర్వకథతో వినియోగింలోకి వచ్చేది. ‘నృత్తము’ అనేది భావము, రసాభినయం లేనిది. ‘నృత్యం’ మాత్రం రసభావాలతో కూడింది. ‘నృత్తము’ కేవలం శరీర విక్షేపం మాత్రమేనని తెలుస్తున్నది. 

భరతముని నాట్యశాస్త్రమే పునాదిగా..

భారతీయ సాహిత్యంలో ‘నాట్యశాస్త్రం’ అనగానే స్ఫురించే పేరు భరతముని. ఇటువంటి నాట్యశాస్త్ర సంబంధ రచనలకు ఆయనే ఆద్యుడు. ఆయన రచనే నాట్య కళాకారులకు, నాట్యగ్రంథకర్తలకు గొప్ప స్ఫూర్తినిచ్చిన గ్రంథం. తదనంతరం ఈ ఇతివృత్తంతో వచ్చిన రచనలన్నీ భరతముని గ్రంథాన్ని పునాదిగా గ్రహించినవే. నందికేశ్వరుని రచన కాని, అభినవ గుప్తుని రచన కాని, జాయప సేనాని రచన కాని, శారదా తనయుని (‘భావ ప్రకాశం’) రచన కాని ఇంచుమించు అన్ని రచనలూ ఈ మార్గంలోనే సాగాయి. కొన్ని కొన్ని ప్రత్యేకాంశాలను జోడిస్తూ తమ ప్రత్యేకతలను వేటికవి నిలుపుకున్నాయి.

భరతముని తన నాట్యశాస్త్రంలో నాట్యోత్పత్తి, నాట్యగృహ గుణాలు, నర్తక నర్తకీ లక్షణాలు వంటివాటి గురించి మాత్రమేగాక గాయక వాద్యకార భాషా వ్యాకరణాల విశేషాలను సైతం వివరించాడు. అంతేగాక, ఈయన ఐదు పాదకర్మలను చెబితే, ‘నృత్త రత్నావళీ’కారుడైన జాయప పది విధాలైన పాదకర్మలను విస్తరించి, లక్షణ సహితంగా వివరించడం విశేషం. నిర్దుష్టంగా ఏది చెప్పినా జాయప పేర్కొన్న విషయాలు ప్రామాణికంగా నిలిచాయి. ఆయా అంగాల కర్మలు, వాటి ప్రత్యేకతలను గూడా చెప్పి, ‘నృత్త రత్నావళి’కి గొప్ప విలువ తెచ్చిన మహామయుడు జాయప సేనాని. నృత్త ప్రధానంగా వచ్చిన గ్రంథం కనుక గ్రంథకర్త తన దృష్టి మొత్తం నృత్త సంబంధ విషయాలపై సారించడం సహజం.

ఎనిమిది అధ్యాయాల ‘నృత్త రత్నావళి’

జాయప ‘నృత్త రత్నావళి’ ఎనిమిది అధ్యాయాల గ్రంథం. కాబట్టి, దాదాపుగా ఇందులోని అన్ని అంశాలూ నృత్త సంబంధమైనవిగానే కూర్చితమయ్యాయి. అయితే, అవసరం, సందర్భం వచ్చినప్పుడు మాత్రం గ్రంథకర్త నాట్య శాస్త్రానుసారంగా కొన్నికొన్ని ప్రత్యేకాంశాలు ఉటంకిం చకుండా ఉండలేదు. అవసరమైన చోట్ల వాటిని మరింత సవివరంగా చెప్పడమేకాక ఇంకా వాటిని విస్తృత పరుస్తూ వర్ణించడాన్ని ఈ ‘నృత్త రత్నావళి’లో మనం చూడవచ్చు. 

ప్రతి అధ్యాయం చివర్లో కావ్యాల్లో వలెనే ఈ గ్రంథకర్త కూడా ‘గద్య’ను చెప్పుకొన్నాడు. 

“ఇతి శ్రీమన్మహారాజాధిరాజ గణపతిదేవ

గజసాధనిక జాయపేనాపతి విరచితయ్యా

నృత్త రత్నావళ్యాం..” అంటూ తన పదవీ బాధ్యతలను, తాను గణపతి దేవుని సేనానినని చెప్పకొంటూ నిబద్ధతను చాటుకున్నాడు. ‘నర్తన వివేకం’ అనే అధ్యాయంతో ప్రారంభమైన ‘నృత్త రత్నావళి’ నృత్త ప్రారంభానికి ముందు వ్యాయామములను నాట్యశాస్త్రానుసారంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. ఇటువంటి వ్యాయామములు యుద్ధ సమయంలోను చేసేవేకాక, గ్రంథకర్త స్వయంగా సేనా నాయకుడు గనుక మరింత గొప్పగా వాటిని చెప్పే ప్రయత్నంలో విజయం సాధించాడు.

దేశి నృత్త లక్షణాలకు వేదిక

‘రసోవై సః’ అన్న వేదోక్తిని అనుసరించి ‘పంచమవేదం’గా సంభావించే ‘నాట్యవేదాని’కి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి, శాస్త్రకారులందరూ అనేక చర్చలు చేసి తమతమ గ్రంథాలను రచించారు. జాయప సేనాని కూడా అదే మార్గంలో సాగిపోయాడనడానికి ఆయన రచన ‘నృత్త రత్నావళి’యే ప్రమాణం. ‘నృత్త రత్నావళి’ ప్రత్యేకతలను నిరూపించే రీతిలోనే గ్రంథరచన సాగింది. ఐదో అధ్యా యంలో జాయప పొందుపరిచిన ‘దేశి నృత్త వృత్తాంతము’, దేశినృత్తములకు ఉండవలసిన లక్షణాలను విపులంగా వివరించడం జాయప సేనాని ప్రత్యేకతగా చెప్పాలి. స్వయంగా ఎన్నో దేశీనృత్తాలను ఆయన ప్రత్యక్షంగా చూసి ఉంటాడు. రాజ్యా ధికారుల్లో ఒకడేకాక ఎందరో కళాకారులతో సన్నిహిత సంబంధాలూ వుండి వుంటాయి కనుక, వాటి లోతులను తెలుసుకొన్న వ్యక్తిగానూ కనిపిస్తాడు. 

ఇవేగాక దేశి స్థానకములను ఇరువది మూడుగా  విభజించడమేగాక ఉత్పత్తి కరణములను గురించి కూడా వివరించడం విశేషం. ఆరో అధ్యాయంలో కూడా దేశీ పాదములను పదహారుగా విభజించి, వాటి స్థానములను, వాటి కదలికలను అనుసరించిన విధానం కనిపిస్తుంది. ప్రతి అధ్యాయంలోను ఎన్నెన్నో కొత్త విశేషాలతో ఈ రచనను సర్వసమగ్ర నర్తనశాస్త్ర గ్రంథంగా సృజించాడు. జాయప సేనాని అపార ప్రతిభ కలిగిన పండితునిగా అడుగడుగునా దర్శనమిస్తాడు.

జానపద, సనాతన నృత్యరీతులను ఎంతో గొప్పగా దర్శింపగలిగడమేకాక మన దేశంలోని నాట్యశాస్త్ర సంప్రదాయాలపై విస్తృత పరిశోధనలు సాగించిన మహామహులు కీ.శే. జమ్మలమడక మాధవశర్మ, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, డా.పో ణంగి శ్రీరామ అప్పారావు, డా.పప్పు వేణుగోపాలరావులు సహా ప్రముఖ కళాకారిణి డా.యశోదా ఠాకూర్ వంటి పెద్దలెందరో జాయప సేనాని ‘నృత్త రత్నావళి’ని గురించి అనేక విలువైన విశేషాలను కళా సాహిత్య ప్రియులకు అందించారు. ఒక మహాసేనానిగా జాయపసేనాని రాజ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, ప్రభువు విజ యాలలో భాగస్వామి అవుతూనే, లోకంలో శాశ్వతంగా నిలిచిపోయే ఇంతటి మహా గ్రంథకర్తగా కూడా కళాభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. 

                 వ్యాసకర్త సెల్: 9949013448

నవ్య గ్రంథం ‘నృత్త రత్నావళి’

కాకతీయుల శిల్పకళకే తలమానికంగా నిలిచి ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రసిద్ధినొందిన ‘రామప్ప దేవాలయ’ శిల్పభంగిమలకు మూలం జాయప సేనాని రచించిన ‘నృత్త రత్నావళి’యే అన్నది అందరి విశ్వాసం. అందుకే, “నృత్తములను ప్రదర్శించే కళాకారునికి లేదా కళాకారిణికి తమ శరీరమే భగవంతుని సాన్నిధ్యానికి చేర్చే మార్గమన్నది నిర్వివాదాంశం” అని ప్రముఖ నృత్యకళాకారిణి, అభినయ కూచిపూడి కళాకేంద్ర సంచాలకురాలు, వేలాది శిష్యుల నాట్యగురువు శ్రీమతి పవని శ్రీలతాప్రసాద్ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. “నృత్త రత్నావళి’ నవ్యతతో కూడిన గ్రంథమే” అన్న ఆమె ప్రశంస అక్షర సత్యం.