calender_icon.png 29 April, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషపుకోరల్లో ‘జవహర్‌నగర్’

29-04-2025 12:10:58 AM

పేదల బతుకులపై పట్టణ వ్యర్థాల భారం

వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లతో హానికరంగా ప్రజారోగ్యం

  1. జవహర్‌నగర్ డబ్ల్యూటీఈ ప్లాంట్‌తో పరిసర ప్రాంతాలు కలుషితం 
  2. ఈ ప్రాంత పరిస్థితులపై పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ నివేదిక’
  3. పర్యావరణహితంగా వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచన

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి ): నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పనతోపాటు వ్య ర్థాల నిర్వహణ కూడా అత్యంత ముఖ్యం. రోజువారీగా పట్టణాల్లో పోగయ్యే వ్యర్థాల ను ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉంటుం ది. లేనిపక్షంలో పర్యావరణం కలుషితమై ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం డంపింగ్ యార్డులు, వ్యర్థాల నుంచి ఇంధనం తయారుచేసే ప్లాంట్లను ఏ ర్పాటు చేసింది.

వ్యర్థాల కారణంగా ప్రజల కు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసినప్పటికీ.. ఈ ప్లాంట్లే సమస్యలకు కారణమవుతున్నాయి. దీనికి ఉదాహరణ జవహర్‌నగర్ మున్సిపల్ కా ర్పొరేషన్ పరిధిలోని వ్యర్థాల నుంచి ఇం ధనం ఉత్పత్తి చేసే ప్లాంటు. వ్యర్థాల సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిపోయి సమ స్యకు కారకంగా నిలుస్తోంది.

నవోదయ వెల్ఫేర్ సొసైటీ, బహుజన సత్తా, క్లుమైట్ ఫ్రం ట్ హైదరాబాద్ వంటి స్వచ్ఛంద సంస్థలు, ఇతర పర్యావరణవేత్తలతో కూడా జాయిం ట్ యాక్షన్ కమిటీ ఇటీవల విడుదల చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ నివేదిక ద్వారా జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను బహిర్గతం చేసింది. 

ఇప్పటికే 24 మెగావాట్ల ప్లాంటు..

వాస్తవానికి వ్యర్థాల నుంచి ఇంధనం(డబ్ల్యూటీఈ) ప్లాంట్ ద్వారా పట్టణాల్లోని ఘ నవ్యర్థాలను కాల్చి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తా రు. పట్టణాల్లోని వ్యర్థాల నిర్వహణకు ఈ ప్లాంట్లు స్థిరమైన పరిష్కారమార్గాలుగా భావిస్తారు. అయితే డంపింగ్ యార్డుల్లో వ్యర్థాలను నిల్వచేయడాన్ని తగ్గించడంతోపాటు వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తిచేసే లక్ష్యంతో ఈ ప్లాంట్లు పనిచేస్తాయి.

కానీ ప్రస్తుతం ఈ ప్లాంట్లు, డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు అనేక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో 24 మెగావాట్ల సామర్థ్యం గల డబ్ల్యూటీఈ ప్లాంటు ఉంది. అంతే సామర్థ్యం గల మరో ప్లాంటు నిర్మాణంలో ఉన్నది. వీటి కారణం గా పర్యావరణంపై ప్రభావం చూ పుతోంది. 

స్థానికుల సమస్యలు..

డబ్ల్యూటీఈ ప్లాంట్ చుట్టుపక్కల 7 పరిసరాల్లోని నివాసితులు నిరం తరం దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన, వాయుకాలుష్యం కార ణంగా శ్వాస తీసుకోవడం కూడా సమస్యగా మారుతున్నట్టు నివేదికతో వెల్లడైంది. స్థానిక ఇం డ్లు, వస్తువులపై బూడిద పొర పడుతుండటంతో ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వస్తువులన్నీ పాడైపోతున్నాయి.

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ గైడ్‌లైన్స్ ప్రకారం పట్టణ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌కు నివాసాలకు మధ్య కనీసం 500 మీటర్లు బఫర్ జోన్‌గా పరిగణించాలి. అప్పుడే వ్యర్థాల ని ర్వహణ ప్లాంట్ నుంచి ఎలాంటి హానికారకా లు విడుదలైనా ప్రజలకు ఇబ్బంది కలగ దు.

ఆరోగ్య సమస్యలు..

జవహర్‌నగర్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా శ్వా సకోశ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం, తీవ్రమైన చర్మ అలెర్జీ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. వీటితోపాటు చాలామంది గొంతు, నోటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద వ్యర్థా లను కాల్చడం ద్వారా విడుదలయ్యే బూడి ద, విషపూరిత కాలుష్య కారకాలే దీనికి ప్ర ధాన కారణం.

తద్వారా స్థానికుల్లో ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు పెరిగేందుకు దారితీస్తోంది. దీనికి తోడు ప్లాంట్ చుట్టుపక్కల ఉండేది నిరుపేదలే కా వడంతో సరైన వైద్యం పొందేందుకు కూడా వారి ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. మొత్తంగా అక్కడ నివసించే ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. 

స్థానికుల ఆవేదన..

డబ్ల్యూటీఈ ప్లాంట్, డంపింగ్ యార్డు వల్ల కలిగే పర్యావరణ క్షీణతను నిరోధించడానికి స్థానికులు అనేక పోరాటాలు చేస్తు న్నారు. తమ ఆవేదన వినిపించడానికి ఉమ్మ డి కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ప్లాంట్‌ను, డంపింగ్ యార్డును నివాసప్రాంతాలకు దూరంగా మార్చాలని డిమాండ్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి ప్రజలకు, పర్యావరణానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను, డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

పర్యావరణ విధ్వంసం..

పట్టణ ఘనవ్యర్థాలతోపాటు హైదరాబాద్‌లోని పారిశ్రామిక వ్యర్థాలు కూడా జవహర్‌నగర్ ప్లాంట్‌కే తీసుకురావడంతో కాలుష్యం మరింత ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం డబ్ల్యూటీఈ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో పర్యావరణం బాగా క్షీణించినట్టు నివేదికలో తేలింది. ఇక్కడి వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల వ్యవసాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

కలుషితనీరు పారడంతోనే వ్యవసాయ ఉత్పత్తులు కూడా కలుషితమవుతున్నాయి. దీంతో స్థానిక రైతులు సాగు కోసం భూగర్భజలాలను వినియోగించడం మానేశారు. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ నీటి వనరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ కాలుష్యం వారి జీవనోపాధికి ముప్పు కలిగిస్తున్నది. 

ప్రమాదకరంగా నీటి కాలుష్యం..

డబ్ల్యూటీఈ ప్లాంట్, డంపింగ్ యార్డు కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కాలుష్యం ఏర్పడుతోంది. ప్లాంట్ నుంచి విడుదలయ్యే బూడిద, కాలుష్య కారకాలు భూగర్భజలాల నాణ్యతను ప్రభావి తం చేస్తున్నాయి. దీంతో స్థానికంగా లభించే నీరు తాగడానికి గానీ, ఇతర అవసరాలకు గానీ సురక్షితం కాదు. వాస్తవానికి నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలన్నీ జవహర్‌నగర్‌కు చేరుకున్న తర్వాత దాదాపు ఏడు రోజుల వరకు డంపింగ్ యార్డులోనే నిల్వ ఉంటాయి.

అనంతరం ప్లాంట్‌లో ప్రాసె స్ చేస్తారు. ఈ క్రమంలో ఈ వ్యర్థాల నుంచి విడుదలయ్యే నీరు భూగర్భంలో కలిసి నీటి కాలుష్యం ఏర్ప డుతోంది. పరిసర ప్రాంతా ల్లో నీటిని పరీక్షిస్తే ప్రమాదకరస్థాయిలో కాలు ష్యం ఉంది. ఇలాగే కొనసాగితే రాబో యే రోజుల్లో నీరు మరింత కాలుష్యానికి గురవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వాసన భరించలేక పోతున్నాం

జవహర్ నగర్ డంప్ యార్డ్ కారణంగా వాస్తున్న వాసన భరించలేక పోతున్నాం. చెత్త తరలించే వాహనాలు విపరీతమైన వేగం తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇక్కడి నుంచి డంప్ యార్డ్ తరలించాలి.

సమ్మిరెడ్డి, అంబేద్కర్‌నగర్, జవహర్‌నగర్

డంప్ యార్డ్ తరలించాలి

జవహర్ నగర్ డంప్ యార్డ్ కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. నగరంలోని చెత్త అంత ఇక్కడికి తీసుకొచ్చి గుట్టగా పోయడం తో స్థానికులు తరచూ అస్వస్థత కు గురవుతున్నారు. డంప్ యార్డ్ తరలించాలనీ చాలా సార్లు అధికారులను కోరాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి.             

 పద్మారావు ముదిరాజ్, జవహర్‌నగర్