calender_icon.png 10 March, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహ్మద్ షమీకి జావేద్ అక్తర్ మద్దతు

08-03-2025 11:35:48 PM

మూర్ఖులను పట్టించుకోవద్దని హితవు...

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ మహ్మద్ షమీకి సీనియర్ రచయిత జావేద్ అక్తర్ మద్దతుగా నిలిచాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో షమీ రంజాన్ ఉపవాస దీక్షకు విరుద్ధంగా నీరు తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. నీరు తాగి షమీ రోజాను ఉల్లఘించాడంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాజాగా ఈ ఘటనపై జావేద్ అక్తర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘షమీ.. మూర్ఖుల వ్యాఖ్యలను పట్టించుకోవద్దు.  మండే ఎండలో మ్యాచ్ ఆడుతూ కాసిన్ని నీరు తాగడం నేరమేమీ కాదు.

అనవసరమైన విషయం గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. దేశం తరఫున ప్రతిష్ఠాత్మక టోర్నీలో ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న మీకు, జట్టు సభ్యులకు ఆల్ ది బెస్ట్’ అని జావేద్ చెప్పుకొచ్చారు. కాగా మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో షమీ ఎనర్జీ డ్రింక్ తాగడం కెమెరాలకు చిక్కింది. పవిత్రమైన రంజాన్ మాసంలో రోజా నిబంధనలను షమీ ఉల్లఘించారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహాబుద్దీన్ రజ్వీ పేర్కొన్నాడు. రోజాను పాటించకుండా షమీ పెద్ద నేరం చేశాడని.. ఆయనొక క్రిమినల్ .. ఈ తప్పిదానికి దేవుడికి సమాధానం చెప్పి తీరాల్సిందేనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.