calender_icon.png 30 September, 2024 | 1:55 AM

జపాన్ కొత్త ప్రధాని షిగెరు ఇషిబా

28-09-2024 01:50:02 AM

  1. అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నిర్ణయం

వచ్చేవారం ప్రధాని పగ్గాలు చేపట్టనున్న ఇషిబా

టోక్యో, సెప్టెంబర్ 27: జపాన్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ రక్షణశాఖ మంత్రి షిగెరు ఇషిబా బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ ఇషిబాను కొత్త ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. వచ్చేవారం ఆయన ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.

అవినీతి ఆరోపణలతో ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిడా రాజీనామా చేయనుండటంతో కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది. కొత్త ప్రధాని పదవి కోసం ఎల్‌డీపీలో 9 మంది పోటీ పడ్డారు. సంప్రదాయవాదిగా ముద్రపడిన ఆర్థికమంత్రి సనయే తకైచి చివరివరకు ఇషిబాకు గట్టి పోటీ ఇచ్చారు. జపాన్ సంప్రదాయం ప్రకారం అధికార పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకొనేందుకు భారీ తతంగమే ఉంటుంది.

ఆ పార్టీకి పార్లమెంటులో ఉన్న సభ్యులందరూ కొత్త నాయకుడి ఎన్నికలో పాల్గొంటారు. వీరితోపాటు పార్టీలోని కీలక సభ్యులు 10 లక్షల మంది కూడా కొత్త నాయకుడి కోసం ఓటు వేస్తారు. ఈ ఓటింగ్‌లో గెలిచిన ఇషిబా జపాన్‌కు కొత్త ప్రధాని కాబోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి రక్షణ కోసం అమెరికాపై జపాన్ ఆధారపడుతున్న విషయం తెలిసిందే.

ఈ విధానాన్ని ఇషిబా తీవ్రంగా విమర్శిస్తున్నారు. భద్రతా ఒప్పందాల విషయంలో జపాన్ రెండు దేశాలకు సమాన గౌరవం ఉండాలని వాదిస్తున్నారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) తరహాలో ఆసియా దేశాలకు కూడా ఒక కూటమి ఉండాలని ప్రతిపాదించారు. వచ్చే మంగళవారం ప్రధాని కిషిడా మంత్రివర్గం రాజీనామా చేయనున్నది.