- గతేడాది కంటే 10.44 శాతం వృద్ధి
- 2024లో రూ.5,448 కోట్లు వస్తే.. 2025లో రూ. 6,017 కోట్లు రాక
- ఇందులో వ్యాట్ రూ.3,921కోట్లు
- కేంద్ర నివేదిక వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): జనవరిలో తెలంగాణకు జీఎస్టీ, వ్యాట్ వసూళ్లు పెరిగాయి. గతేడాది జనవరిలో రెండు కలిపి రూ.5,448 కోట్లు రాగా.. ఈసారి రూ.6,017 కోట్లు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో జనవరిలో 2024తో పోలిస్తే 10.44శాతం వృద్ధిని నమోదు చేసిం ది. ఇక వ్యాట్ విషయానికొస్తే గతేడాది రూ. 3,351.88కోట్లు రాగా.. ఈసారి రూ. 3,921కోట్లు వసూలైంది. వ్యాట్‌లో 17శాతం వృద్ధి నమోదైంది.
గత ఎనిమిది నెలల్లో 10.44శాతం జీఎస్టీ వసూలు కావ డం ఇదే మొదటిసారి. 2024 మేలో చివరిసారిగా వసూళ్లలో 11శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత రాబడి తగ్గింది. ఆగస్టులో అత్యల్పంగా ఒకశాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. నవంబర్ 3శాతం పెరిగిన వసూళ్లు.. డిసెంబర్ ఏకం గా 10శాతానికి వృద్ధి చెందాయి. ఇదే సమయంలో జనవరిలో గతనెల కంటే కొంత పెరిగింది.
పెరిగినా అంచనాలకు దూరమే..
ఆదాయం తెచ్చే విభాగాల్లో వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వానికి గుండెకాయలాంటిది. 2024 బడ్జెట్‌కు రూ.85వేల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే వసూళ్లలో నెలకు 18శాతం వృద్ధి సాధించాలి. పదినెలల్లో ఒక్కసారి కూడా వాణిజ్య పన్నుల శాఖ 18శాతం లక్ష్యాన్ని చేరుకోలేదు.
దీంతో పదిశాతం వృద్ధిని సా ధించినా.. అంచనాలను అందుకోవాలంటే.. ఇంకా వసూళ్లు భారీగా పెరగాల్సి ఉంటుం ది. డిసెంబర్‌లో కాగ్ రిలీజ్ చేసిన గణాంకాలు కూడా ఇవే చెబుతున్నాయి. జీఎస్టీ అంచనాల్లో ఇప్పటివరకూ 64.28శాతం మాత్రమే వసూలయ్యాయి. ఇంకా 35.72 శాతం వసూళ్లను రాబట్టాల్సింది.
రాష్ట్రంలో 5.39లక్షల జీఎస్టీ ఖాతాలు
రాష్ట్రంలో జనవరి నాటికి 5,39,495లక్షల జీఎస్టీ ఖాతాలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ పరిధిలో 2,28,919, స్టేట్ జీఎస్టీ పరిధిలో 3,10,576 ఉన్నాయి. డిసెంబర్ కంటే జనవరిలో 2,142 సెంట్రల్ పరిధిలో జీఎస్టీ ఖాతాలు పెరిగాయి. స్టేట్ జీఎస్టీ పరిధిలో 855 ఖాతాలు పెరిగినట్లు కేంద్ర తెలిపింది.