14-03-2025 12:00:00 AM
చర్లపల్లి, అమ్ముగూడ, సనత్‌నగర్ మీదుగా రూటు మార్చిన ద.మ.రైల్వే
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (విజయక్రాంతి): విశాఖపట్నం, లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబరు 12805/06) స్టాప్‌ను సికింద్రాబాద్‌లో రద్దు చేస్తూ ద.మ.రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 25 నుంచి శాశ్వతంగా చర్లపల్లి, అమ్ముగూడ, సనత్‌నగర్ మీదుగా రాకపోకలు సాగించేలా రూటు మార్చారు.
ఏప్రిల్ 25న విశాఖపట్నం నుంచి ఉదయం 6.20కి బయల్దేరే రైలు అదే రోజు సాయంత్రం 6.05కు చర్లపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి రాత్రి 7.40కి లింగంపల్లికి వస్తుంది. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు ఏప్రిల్ 26న ఉదయం 6.15కు ప్రారంభమై 7.15 గంటలకు చర్లపల్లికి, అక్కడి నుంచి 7.20 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
ఇంతకాలం సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలో ఆగిన ఈ రైలు రూటు మారడంతో ఆ స్టేషన్లకు దూరమైంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాల్సి ఉంది. కాగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలును చర్లపల్లికి మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.