calender_icon.png 24 October, 2024 | 2:50 AM

జైలుకు వెళ్లొచ్చినా చోరీలు మానలే..

12-08-2024 05:24:03 PM

తాళం వేసిన ఇండ్లే టార్గెట్

ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన జనగామ పోలీసులు

జనగామ: కూలీలుగా ఉన్న ముగ్గురు స్నేహితులు జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారారు. పోలీసులకు దొరికి జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని జనగామ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. డీసీపీ రాజమహేందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం అర్జున్​పట్ల గ్రామానికి చెందిన బురుగు యదగిరి, నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకినిపాడు గ్రామానికి చెందిన తలకోటి ప్రవీణ్ హైదరాబాద్ లోని సింగరేణి కాలనీకి వలస వచ్చి కూలీ పనులు చేసుకునేవారు.

అదే కాలనీకి చెందిన చుకుటాల కుమార్​తో వీరికి పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురు కలిసి జల్సాలకు అలవాటు పడి కూలీ పనులు చేస్తే వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలకు పాల్పడ్డారు. తమ కాలనీతో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చోరీలకు చేస్తుండగా.. హైదరాబాద్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాక సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొత్త దొమ్మాట గ్రామంలో ఓ మామిడితోటలో పనికోసం వచ్చారు. ఇక్కడ పనిచేస్తే వచ్చే డబ్బులు చాలకపోవడంతో మళ్ళీ దొంగతనాలు మొదలుపెట్టారు.

జనగామ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న పలు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. సోమవారం జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద సీఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ భరత్ వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఇదే సమయంలో అటుగా వస్తున్న ముగ్గురు దొంగలు పోలీసులను చూసి పాలిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అడుపులోకి తీసుకుని విచారించగా తాము చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 7.3 తులాల బంగారం, 64 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.